ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా?

22 Aug, 2022 19:27 IST|Sakshi

లండన్‌: విహారయాత్రకు వెళ్లి ఎండలో నిద్రలోకి జారుకున్న ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఆమె నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయింది. బ్రిటన్‌కు చెందిన బ్యూటీషియన్‌ సిరిన్‌ మురాద్‌ (25) అనే యువతి కొద్ది రోజుల క్రితం బల్గేరియాకు విహారయాత్రకు వెళ్లింది. ఓ పూల్‌ వద్ద కూర్చొని అక్కడే కాసేపు కునుకుతీసింది. 30నిమిషాలకు మేల్కొన్న తర్వాత నుదురు, చెంపలు కాస్త మండినట్లు అనిపించినప్పటికీ.. పట్టించుకోలేదు. ఎండకు పొడిబారినట్లుందని మళ్లీ నిద్రపోయింది. అయితే మరుసటి రోజు నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా తయారైంది. ఎండలో నిద్రపోవడమే దీనికి కారణమని భావించింది.. పైగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా అప్లై చేసుకోలేదని పేర్కొంది. తాను నిద్రపోయిన ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు 21డిగ్రీలు ఉన్నట్లు తెలిపింది. 

నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా కనిపిస్తున్నా.. ఏం జరగదులే అని భావించి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు సిరిన్‌ మురాద్‌. రోజులకు ఆమె ముఖం మొత్తం పగుళ్లు తేలినట్లు మారింది. అయితే.. ప్రస్తుతం కోలుకున్నానని, కొన్ని జాగ్రత్తలు పాటించడంతో తిరిగి ఒకప్పటిలా మారిపోయాయని ఫేస్‌బుక్‌లో నాటి, నేటి ఫొటోలను పంచుకుంది సిరిన్‌. మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తున్నట్లు పేర్కొంది. కాగా, తాను ఎదుర్కొన్న వింత, భయానక అనుభవాన్ని వివరిస్తూ.. ఆ యువతి ప్రస్తుతం సన్‌స్క్రీన్‌ లోషన్ల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తోంది. వైద్య నిపుణులు మాత్రం ఆమె చర్మం అలా కావడానికి వేరే కారణం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎండలో వెళితే అందరికి అలా జరగదని, క్యాన్సర్‌ ఉన్నవారు ఆ తరహా సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: భార్యలు రాజేసిన చిచ్చు.. పక్కనున్న పలకరింపుల్లేవ్‌!! ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?

మరిన్ని వార్తలు