పుతిన్‌ ఇద్దరు కూతుళ్లే లక్ష్యంగా..

6 Apr, 2022 13:41 IST|Sakshi

ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యల పేరిట నరమేధానికి పాల్పడుతున్నాడంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను చాలా దేశాలు నిందిస్తున్నాయి. బుచా నరమేధం వెలుగులోకి వచ్చాక ఆ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు మొదటి నుంచి అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలతో రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో.. 

ప్రధాని పుతిన్‌ కూతుళ్లను లక్ష్యంగా చేసుకుని కఠిన ఆంక్షలు విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ అనుకుంటోంది. పుతిన్‌ కూతుళ్లు కాటెరీనా, మరియాలపై విధించబోయే ఆంక్షల జాబితాను సిద్ధం చేసింది యూరోపియన్‌ యూనియన్‌. ప్రత్యేకంగా పుతిన్‌ దృష్టికి వెళ్లేలా ఈ ఆంక్షలు ఉండబోతున్నాయని ఈయూ అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈయూ దేశాల ప్రభుత్వాలు వీటికి అధికారిక ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. 

పుతిన్‌ ఇద్దరు కూతుళ్లతోపాటు రష్యా రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పుతిన్‌ కుటుంబ సభ్యులకూ ఈ ఆంక్షలు వర్తింపజేయాలని అనుకుంటున్నాయి. రక్షణ రంగంలో పాటు నాలుగు బ్యాంకులపైనా, బొగ్గు ఉత్పత్తులపైనా కొత్త ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే క్రెమ్లిన్‌ మాత్రం అలాంటి ఆంక్షల ప్రతిపాదనేది తమ దృష్టికి రాలేదని అంటోంది. ఇప్పటికే పుతిన్‌ దగ్గరి వాళ్లపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

పుతిన్‌ కూతుళ్లు ప్రస్తుతం రహస్య జీవనంలో ఉన్నారు. రకరకాల పేర్లు మార్చుకుని.. ప్రాంతాలు మారుతూ జీవిస్తున్నారు. అయితే అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ మాత్రం ఏనాడూ వాళ్ల పేర్లను, ఐడెంటిటీని రివీల్‌ చేయలేదు. అలాగే యుక్త వయసులో వాళ్లు ఎలా ఉన్నారనే ఫొటోలు ఎక్కడా లేవు. ఈ తరుణంలో ఆంక్షల విధింపు, అన్వయింపజేయడంపై ఆసక్తి నెలకొంది. 

చివరిసారిగా 2015లో పుతిన్‌ తన కూతుళ్ల గురించి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన కూతుళ్లు గ్రాడ్యుయేట్లు అని, బోలెడు భాషలు మాట్లాడగలరని మాత్రమే చెప్పాడు. పుతిన్‌ పెద్ద కూతురు మరియా వోరోన్‌త్సోవా.. హెల్త్‌ కేర్‌కు సంబంధించిన పెట్టుబడుల కంపెనీ నోమోన్కోకి సహ భాగస్వామిగా ఉంది. అలాగే చిన్న కూతురు కాటెరీనా టిఖోనోవా.. మాస్కోలోని అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ ఇనిస్టిట్యూట్‌ను నడిపిస్తోందన్నది మాస్కో మీడియా వర్గాలు ఆ మధ్య ఫొటోలతో సహా కథనాలు ప్రచురించాయి.

చదవండి: పుతిన్‌ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది?

మరిన్ని వార్తలు