ఉక్రెయిన్‌ యుద్ధం: మొదటి ప్రపంచ యుద్ధం తరహా దాడులు.. రష్యా బలగాలు అతలాకుతలం

14 Jun, 2022 15:42 IST|Sakshi

Ukraine War: రష్యా, తూర్పు ఉక్రెయిన్‌ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70 శాతం నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా నిరాటంకంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా బలగాలు డోనెట్స్ నదిపై ఉన్న మూడు బ్రిడ్జిలను కూల్చి ఉక్రెయిన్‌ బలాగాలను నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. పైగా లొంగిపోండి లేదా చచ్చిపోండి అంటూ రష్యా బలగాలు నినాదాలు చేశాయి.

ఈ తరుణంలో ఇవాళ సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఉక్రెయిన్‌ తన యుద్ధ వ్యూహాన్ని మార్చేసింది. శత్రుదేశాన్ని మట్టికరిపించేలా మెదటి ప్రపంచ యుద్ధం తరహాలో ఆపరేషన్‌ చేపట్టింది. శత్రు దాడులనుంచి రక్షణకోసం ఏర్పాటు చేసుకునే కందకాలానే(దాడుల నుంచి రక్షణ కోసం భూమిలో ఏర్పాటు చేసుకునే ఇరుకైన గుంత) లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలు పెట్టాయి ఉక్రెయిన్‌ బలగాలు.

ఈ మేరకు ఉక్రెయిన్‌ బలగాలు కందకంలో ఉంటున్న రష్యా బలగాలపై డ్రోన్‌లతో నేరుగా దాడులు చేసింది. ఈ దాడులు విజయవంతం కావడంతో ఉక్రెయిన్‌ దళాలు జోష్‌తో ముందుకు వెళ్తున్నాయి. ఊహించని ఈ దాడులతో రష్యా బలగాలు అతలాకుతలం అవుతున్నాయి. కింగ్‌ డేనియల్‌ పేరుతో 24వ మెకనైజ్డ్ బ్రిగేడ్ ఉక్రెయిన్‌ సైనికులు ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తాం అంటూ... 'స్లేవ్‌ ఉక్రెయిన్‌'(ఉక్రెయిన్‌ బానిస)... 'గ్లోరి టూ ఉ‍క్రెయిన్‌' (ఉక్రెయిన్‌ కీర్తీ) వంటి నినాదాలతో దాడులు చేశారు.

రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన పై దాడులకు తెగబడటంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. అతి చిన్న పోరుగు దేశం పై ఎందుకు యుద్ధం అన్నా వినలేదు. కానీ ఇప్పుడు ఆ చిన్నదేశం ఉక్రెయిన్‌తో ఊహించని ప్రతిఘటనను రష్యా ఎదుర్కొంటోంది. అంతేకాదు ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా మేజర్‌ జనరల్‌ వంటి ఆర్మీ అధికారుల నుంచి దిగ్గజ షూటర్ల వరకు పెద్ద సంఖ్యలో యుద్ధవీరులను కోల్పోయింది కూడా. ఈ మేరకు ఉక్రెయిన బలగాలు డ్రోన్‌లతో రష్యా కందకాలపై దాడుల నిర్వహిస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఇంత దారుణమేంటి పుతిన్‌.. స్పెషల్‌ బాడీగార్డుతో అలాంటి పనేంటి..?)

మరిన్ని వార్తలు