యుద్ధం తర్వాత ఇదే తొలిసారి.. భారత్‌లో పర్యటించనున్న ఉక్రెయిన్ మంత్రి!

8 Apr, 2023 17:35 IST|Sakshi

ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా భారత్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగం‍గా ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులు, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఆమెకిదే మొదటి అధికారిక పర్యటన కావడం గమనార్హం.  సోమవారం( ఏప్రిల్‌ 10) భారత్‌లో అడుగుపెట్టనున్న జపరోవా... నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.


ఝపరోవా ఈ పర్యటనలో విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీని కూడా కలవనున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు, బహుముఖ సహకారాన్ని పంచుకుంటోంది. దౌత్య సంబంధాలను నెలకొల్పిన గత 30 సంవత్సరాలలో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం వాణిజ్యం, విద్య, సంస్కృతి, రక్షణ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. పరస్పర అవగాహన, ఆసక్తులను మరింత పెంచుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని‘ తెలిపింది. 

ఈ పర్యటనలో ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కైవ్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్ల ఓ వార్తాపత్రిక పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అనేక సార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలని సూచిస్తూ వచ్చారు. 

మరిన్ని వార్తలు