ముగిసిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు

1 Oct, 2020 08:39 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి : ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు అంతర్జాతీయ సహకారం, కోవిడ్‌ మహమ్మారిపై ఐక్యపోరాటం లాంటి విషయాలతో ఉత్సాహంగా ప్రారంభమై, చివరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ముగిశాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, మానవహక్కుల ఉల్లంఘన, తాజాగా అమెరికా చైనాల మధ్య రగులుతోన్న ప్రచ్ఛన్న యుద్ధం ఆందోళన కలిగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్, సమితి సమాశాల ప్రారంభోపన్యాసంలో అన్నారు. కరోనా మహమ్మారిపై ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివిధ దేశాధినేతలు నొక్కివక్కాణించారు. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల్లో అధిక భాగం బహుళ సహకారం గురించి, దాని ఆవశ్యకతను, సవాళ్ళను ప్రస్తావించాయి. ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల మధ్య తాజాగా తలెత్తిన యుద్ధంపై ఇరుదేశాల దౌత్య వేత్తలు పరస్పరం కత్తులు దూసుకున్నారు. (మోదీపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ ప్రశంసలు)

బాంగ్లాదేశ్‌కి వచ్చిన ఏడు లక్షల మంది రోహింగ్యా ముస్లింల సమస్యపై మ‌య‌న్మార్‌ని, బాంగ్లాదేశ్‌ నిలదీసింది. రెండు అణుబాంబులకు సరిపోయిన యురేనియం నిల్వలను ఇటీవలి మాసాల్లో ఇరాన్‌ పోగేసుకుందని ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహో చేసిన ఉపన్యాసంపై ఇరాన్‌ మండిపడింది. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయిల్, దుందుడుకుగా వ్యవహరిస్తోందని, పాలస్తీనా విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ధిక్కరిస్తున్నదని ఇరాన్‌ దౌత్యాధికారి మండిపడ్డారు. ఎమెన్‌ దేశంలో, హౌతీ షిౖయెట్‌ తిరుగుబాటుదారులకు ఇరాన్‌ సహకరిస్తోందని, అస్థిర పరిస్థితులు సృష్టిస్తోందని యూఏఈ మండిపడింది. కరోనా మహమ్మారి విషయంపై రష్యా, చైనాని సమర్థించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చైనా సార్వభౌమాధికారం, సమగ్రత విషయాల్లో, తైవాన్‌ని వెనకేసుకొస్తూ అమెరికా జోక్యం చేసుకుంటోందని, చైనా ఆరోపించింది. (సోనూసూద్‌కి ఐరాస అవార్డ్‌)

మరిన్ని వార్తలు