చైనాకు మ‌రో షాకిచ్చిన అమెరికా

22 Dec, 2020 19:46 IST|Sakshi

వాషింగ్ట‌న్‌: రెండు ఆధిపత్ యరాజ్యాల మధ్య పోరు రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాకు షాకిచ్చే మ‌రో బిల్లును పాస్ చేసింది. ఆధ్యాత్మిక  గురువు ద‌లైలామా వార‌సుడిని ఎంచుకునే హ‌క్కు టిబెటన్ల‌కే క‌ల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. ద టిబెట‌న్ పాల‌సీ అండ్ స‌పోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ)  ప్రకారం టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. అలాగే దలైలామాకు వారసుడిని ఎన్నుకునే  సంపూర్ణ హక్కు టిబెటన్లకు దక్కనుంది.మరోవైపు ఇదొక చారిత్రాత్మక చర్యగా, చైనాకు స్పష్టమైన సందేశంగా ధర్మశాల అభివర్ణించింది.

ఈ నిర్ణ‌యం ప్ర‌స్తుత ద‌లైలామా, టిబెట‌న్ బుద్ధిస్ట్ లీడ‌ర్లు, టిబెట్ ప్ర‌జ‌లదే అని టీపీఎస్ఏ స్ప‌ష్టం చేస్తోంద‌ని సెంట్ర‌ల్ టిబెట‌న్ అడ్మినిస్ట్రేష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇప్ప‌టికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ వ్య‌వ‌హారంలో చైనా ప్ర‌భుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే, తీవ్ర‌మైన ఆంక్ష‌లు ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని కూడా హెచ్చ‌రించింది. దీనిపై స్పందించిన చైనా   అమెరికాపై మండిప‌డుతోంది. అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీని ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీసుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం బీజింగ్‌లోని ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై సంత‌కం చేయ‌కూడ‌ద‌ని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.

టీపీఎస్ఏ చ‌ట్టం టిబెటన్ స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయంగా సెంట్ర‌ల్ టిబెట‌న్ అడ్మినిస్ట్రేష‌న్ అధ్య‌క్షుడు లాబ్‌సాంగ్ సాంగాయ్ పేర్కొన్నారు. దీని కోసం తాము రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. చైనా ఇప్ప‌టికే  తరువాతి ద‌లైలామాను నియ‌మించే ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టిన నేప‌థ్యంలో అమెరికా ఈ చ‌ట్టాన్ని తీసుకురావ‌డం ప్రాధాన్య‌తను సంత‌రించుకుంది. కాగా తొమ్మిదేళ్ల క్రితం టిబెట్‌పై దాడి చేసి,  చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటును దారుణంగా అణచివేసిన చైనా టిబెట్ బౌద్ధమతాన్నికూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది. భారతదేశంలో 80 వేల మంది టిబెటన్లు ప్రవాసంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 150,000 మంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు