వందేళ్ల నాటి గోడలో.. 66 విస్కీ బాటిల్స్‌

26 Nov, 2020 18:38 IST|Sakshi

వాషింగ్టన్‌: సాధారణంగా వందల ఏళ్ల క్రితం నాటి కట్టడాల పట్ల ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే పూర్వం అక్కడ ఏమైనా విలువైన వస్తువులు, నిధి నిక్షేపాలు వంటివి దాచారేమోననే అనుమానం ఉంటుంది. వాటిని వెలికి తీయడం కోసం చాలా మంది రహస్యంగా తవ్వకాలు జరుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథనం కూడా ఇలాంటిదే. అయితే తవ్వకాలు జరిపింది నిషేధిత ప్రాంతంలో కాదు. సొంత ఇంట్లోనే. ఇక గోడలో వెలుగు చూసిన వస్తువులను చూసి ఆ దంపతులు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. తమకు లభించిన వస్తువులకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. ఇంతకు వారికి గోడలో ఏం కనిపించాయి అంటే 66 విస్కీ బాటిళ్లు. అవును అది కూడా స్మగుల్డ్‌ బాటిల్స్‌. 

వివరాలు.. న్యూయార్క్‌కు చెందిన దంపతులు నిక్ డ్రమ్మండ్, పాట్రిక్ బక్కర్ పోయిన నేలలో వారి కొత్త ఇంటికి మారారు. అయితే అక్కడ ఇంటి గోడలో తమకు మద్య నిషేద యుగం కాలానికి చెందిన విస్కీ బాటిళ్లు లభ్యమవుతాయని వారు కలలో కూడా ఊహించలేదు. ఈ సంఘటన ఈ ఏడాది అక్టోబర్‌లో చోటు చేసుకుంది. నిక్‌ డ్రమ్మండ్‌ దంపతులు ఈ ఇంటిని ఓ నటోరియస్‌ స్మగ్లర్‌ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. వందేళ్ల నాటి ఇల్లు కావడంతో మరమత్తులు చేపించాలని భావించారు. ఆ క్రమంలో క్షీణించిన ఇంటి గోడలను బాగు చేసేందుకు గాను తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో వారికి వరుసగా విస్కీ బాటిళ్లు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని తమకు దక్కిన అదృష్టాన్ని తలచుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. (చదవండి: 10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి? )

A post shared by Nick Drummond (@bootleggerbungalow)

‘మా ఇంటిని మద్యంతో నిర్మించారు’ అనే క్యాప్షన్‌తో ఫోటోలని ఫేర్‌ చేశాడు నిక్‌. ఇక విస్కీ బాటిళ్లు మధ్యనిషేధం నడిచిన 1920 కాలానికి చెందినవి. వాటి మీద తయారీ తేదీ‌ అక్టోబర్‌ 23, 1923గా ఉంది. ఇక మొత్తం 66 బాటిళ్లలో 13 ఫుల్‌గా ఉండగా.. 9 మంచి పరిస్థితిలో ఉన్నాయి.. నాలుగు పూర్తిగా క్షీణించాయి. ఇక కొన్నింటిలో విస్కీ సగమే ఉంది. ఇన్నేళ్లు గోడలోపల ఉండటంతో ఆవిరి అయి ఉండవచ్చు అన్నాడు నిక్‌. ఈ ఫోటోలు చేసిన నెటిజనులు ‘మీరు ఆ విస్కీని ట్రై చేశారా’.. ‘వేలం వేసే ఆలోచన ఉంటే చెప్పండి.. నేను కొంటాను’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన మద్యం ప్రియులు మాత్రం ‘అదృష్టం అంటే నీదే పో’ అంటూ ఈర్షపడుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా