తైవాన్‌లో అమెరికా గవర్నర్‌ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో?

22 Aug, 2022 15:04 IST|Sakshi

తైపీ: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉంది చైనా. పెలోసీ పర్యటన తర్వాత తైవాన్‌ను యుద్ధ విమానాలతో చుట్టుముట్టింది. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే అమెరికా చట్టసభ్యుల బృందం తైవాన్‌లో పర్యటించి మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. చైనా సైనిక విన్యాసాలు చేపడుతూ తైవాన్‌ను బయపడుతున్న ఈ తరుణంలోనే అమెరికా గవర్నర్‌ తైపీలో పర్యటించారు. తైపీతో వాణిజ్య చర్చలు చేపడతామని అమెరికా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆయన పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక అభివృద్ధి ట్రిప్‌లో భాగంగా ఆదివారం తైవాన్‌ చేరుకున్నారు అమెరికాలోని ఇండియాన రాష్ట్ర గవర్నర్‌ ఎరిక్‌ హోల్కోంబ్‌. తైవాన్‌ అధ్యక్షుడిని సోమవారం కలిశారు.

కొద్ది రోజుల క్రితం స్పీకన్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటాన్ని వ్యతిరేకిస్తూ మిలిటరీ డ్రిల్స్‌ చేపట్టింది చైనా. దాంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తైవాన్‌కు మద్దతుగా దౌత్యపరమైన చర్యలు చేపడితే ఊరుకునేది లేదని, తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా గవర్నర్‌ హోల్కోంబ్‌తో భేటీ అయ్యారు తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌ వెన్‌‌. బీజింగ్‌ మిలిటరీ డ్రిల్స్‌పై మాట్లాడారు. తైవాన్‌కు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 

‘ప్రస్తుతం మనం ప్రపంచ నిరంకుశత్వ నిరంతర విస్తరణవాదాన్ని ఎదుర్కొంటున్నాం. తైవాన్‌ జలసంధి ద్వారా చైనా నుంచి సైనిక బెదిరింపులను తైవాన్ ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రజాస్వామ్య మిత్రపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి అన్ని విధాల సహకారం అందించాలి.’ అని తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌ వెన్‌ పేర్కొన్నారు. తైవాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు అమెరికా గవర్నర్‌ హోల్కోంబ్‌. మరోవైపు.. బుధవారం దక్షిణ కొరియాకు వెళ్లేలోపు సెమీకండక్టర్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో హోల్కోంబ్‌ భేటీ అవుతారని అధికారవర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్‌.. సూసైడ్‌ బాంబర్‌ అరెస్ట్‌!

మరిన్ని వార్తలు