మీ రక్షణ మా బాధ్యత

27 Mar, 2022 06:17 IST|Sakshi
వార్సాలో ఉక్రెయిన్‌ శరణార్థులతో మాట్లాడుతున్న బైడెన్‌

రష్యా దాడికి దిగితే రక్షిస్తాం

పోలండ్‌కు బైడెన్‌ భరోసా

వార్సాలో శరణార్థుల శిబిరం సందర్శన

లక్ష మందికి ఆశ్రయమిస్తామని వెల్లడి

వార్సా: ‘‘మీ రక్షణ మా బాధ్యత. రష్యా ఒకవేళ దాడికి దిగితే మేం రక్షిస్తాం. మీ స్వేచ్ఛకు మాది పూచీ’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పోలండ్‌కు హామీ ఇచ్చారు. నాలుగు రోజుల యూరప్‌ పర్యటన ముగింపు సందర్భంగా పోలండ్‌ అధ్యక్షుడు ఆంద్రె డూడాతో ఆయన భేటీ అయ్యారు. నాటో కూటమిని విడదీయాలన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కలలు కల్లలుగానే మిగిలాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ శరణార్థులకు భారీ సంఖ్యలో ఆశ్రయమిచ్చిందంటూ పోలండ్‌ను కొనియాడారు. శరణార్థులను ఆదుకుంటున్న పోలండ్‌కు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అదనంగా లక్ష మంది ఉక్రెయిన్‌ వాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని ఉద్ఘాటించారు.

పుతిన్‌ ఓ నరహంతకుడు  
వార్సాలో ఉక్రెయిన్‌ శరణార్థుల శిబిరాన్ని బైడెన్‌ సందర్శించారు. గంటపాటు శరణార్థులతో మాట్లాడారు. వారి కష్టాలు విని చలించిపోయారు. పుతిన్‌ నరహంతకుడంటూ మండిపడ్డారు. పుతిన్‌ దాష్టీకాల వల్ల వేలాది మంది మహిళలు, పిల్లలు పొరుగు దేశాల్లో తలదాచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శిబిరాల్లో చిన్నారులను చూస్తే మనసు ద్రవిస్తోందన్నారు.

పోలండ్‌కు 20 లక్షల మంది
ఉక్రెయిన్‌తో పోలండ్‌ దేశం 300 మైళ్ల సరిహద్దును పంచుకుంటోంది. 35 లక్షల మంది ఉక్రెయిన్‌ శరణార్థుల్లో 20 లక్షల మంది పోలండ్‌కు చేరుకున్నారు. వారికి స్వచ్ఛంద సంస్థలు, పలు దేశాలు నిత్యావసరాలు పంపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు