తల్లి చేసిన తప్పిదం.. జీవితం నాశనమైందన్న షింజో అబే హంతకుడు.. కానుకలతో సింపథీ.. రాజకీయంగానూ ప్రకంపనలు

27 Aug, 2022 13:41 IST|Sakshi

జపాన్‌ శక్తివంతమైన నేత, మాజీ ప్రధాని షింజో అబేను హ్యాండ్‌ మేడ్‌ గన్‌తో కాల్చి చంపాడు నిందితుడు టెత్సుయా యమగామి. అయితే.. ఈ ఘటన జరిగి నెలపైనే కావొస్తుంది. ఇప్పుడు యమగామి పట్ల ఇప్పుడు అక్కడి జనాల్లో సానుభూతి  ఏర్పడింది. అంతేకాదు.. అతనికి కానుకలు కూడా పంపిస్తున్నారు. అసలు అబే ‘తన సిసలైన శత్రువు కాద’ని అతను రాసిన ఓ లేఖ ఇప్పుడు అక్కడ సంచలనంగా మారడంతో పాటు రాజకీయంగానూ ప్రకంపనలు పుట్టిస్తోంది. 

మాజీ ప్రధాని షింజో అబే మరణం.. జపాన్‌ను మాత్రమే కాదు, యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జులై 8వ తేదీ నారాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన్ని.. హ్యాండ్‌ మేడ్‌ గన్‌తో అతి సమీపం నుంచి కాల్చి చంపాడు టెత్సుయా యమగామి(41). ఘటనా స్థలంలోనే యమగామిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. షింజో అబే ప్రాణాల్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తల్లి చేసిన పనితోనే.. 
టెత్సుయా యమగామి తల్లి.. చర్చి ఏకీకరణ విధానానికి మద్దతుగా భారీగా విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్లింది. దాని వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా నాశనం అయ్యింది. అప్పటికే ఉద్యోగం.. ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. షింజో అబేను చంపిన హంతకుడే అయినప్పటికీ.. యమగామి కథ తెలిశాక చాలామందికి  సానుభూతి మొదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల ఆర్థిక, సామాజిక ఆటుపోట్లతో నలిగిపోతున్న ఒక తరం మొత్తం అతనికి మద్దతుగా నిలుస్తోంది.

అతను మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ.. అతను ఉంటున్న జైలుకు కానుకలు పంపిస్తున్నారు. అతనికి మద్దతుగా సంతకాల సేకరణ నడుస్తోంది. అందులో అతని వాదనలు వినేందుకు సానుకూల స్పందన కోరుతూ ఏడు వేలమందికి పైగా పిటిషన్‌పై సంతకాలు చేశారు. ఒకవేళ అతను గనుక ఈ నేరం చేసి ఉండకపోతే.. అతని కథ తెలిశాక సానుభూతి ఇంకా ఎక్కువే జనాల్లో కలిగి ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. 

లేఖలో ఆవేదన
షింజో అబే హత్యకు ముందు రోజు.. పశ్చిమ జపాన్‌కు చెందిన ఓ  బ్లాగర్‌కు యమగామి ఓ కంప్యూటర్‌ టైప్డ్‌లేఖను పంపాడు. అందులో సమాచారం ప్రకారం.. తన తల్లి మతం మత్తులో అడ్డగోలుగా ధనం వృథా చేసిందని, దాని వల్ల తన యవ్వనం మొత్తం వృథా అయ్యిందని ఆవేదన చెందాడు. నాలుగేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. తల్లి మతం మత్తులో పడిపోయి భారీగా విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్లింది. తిండి కూడా పెట్టకుండా ఆ డబ్బును విరాళానికే కేటాయించింది. చివరికి.. ఆస్తులన్నింటిని అమ్మేసి.. అప్పుల పాల్జేసింది. ఆ అప్పులకు భయపడి నా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాగోలా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నేను.. 2005 నుంచి మూడేళ్ల పాటు జపాన్‌ నావికాదళంలో మారీటైమ్‌ సెల్ఫ్‌–డిఫెన్స్‌ ఆఫీసర్‌గా పనిచేశా.  ఆ తర్వాత ఏ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నా. చివరికి.. 2020లో కాన్సాయ్‌లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. 

ఆర్థికంగా చితికిపోయి ఉన్న యమగామికి మానసిక సమస్యలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అలసిపోయా. చివరకు రాజీనామా చేశా. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు యమగామి. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్‌ ఇయర్‌బుక్‌లో రాశాడు. అంతేకాదు సోషల్‌ మీడియాలోనూ చర్చి ఏకీకరణ విధానాన్ని తప్పుబడుతూ పోస్ట్‌లు సైతం చేశాడు. 

నన్ను శిక్షించండి
1954 సౌత్‌ కొరియా నుంచి మొదలైన యునిఫికేషన్‌ చర్చి విధానం.. జపాన్‌కు చేరింది. అయితే దాని వల్ల తన లాంటి కుటుంబాలెన్నో ఆర్థికంగా నష్టపోయాయన్నది యమగామి లేఖ సారాంశం. అయితే.. తన లక్ష్యం చంపడం కాదని, విధానానికి.. దానికి మద్దతు ఇస్తున్నఓ మతసంస్థకు షింజో అబే మద్ధతును ప్రకటించడమే తనలో కసిని రగిల్చిందని అని యమగామి కన్నీళ్లతో చెప్తున్నాడు. ‘‘నా తల్లి చేసిన తప్పులతో నా జీవితం సర్వనాశనం అయ్యింది. అయినా ఫర్వాలేదు. నేను చేసిన పని వల్ల ఈ విధానానికి ముగింపు పలికితే చాలు. ఎన్నో కుటుంబాలు భవిష్యత్తులో నష్టపోకుండా బాగుపడతాయి. అబేలాంటి గొప్ప రాజకీయవేత్తను చంపినందుకు పశ్చాత్తాప పడుతున్నా. అలాగని క్షమాభిక్ష కావాలని నేను కోరుకోను. ఎందుకంటే నేను చేసింది తప్పే. చీకట్లు అలుముకున్న నా జీవితాన్ని త్వరగా శిక్షించి.. ముగించేయండి’’ అంటూ ఓ జపాన్‌ మీడియా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు యమగామి.      

ఇక షింజో అబే హత్య జరిగినప్పటి నుంచి.. జపాన్‌ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిదా ప్రజాదరణ క్షీణిస్తూ వస్తోంది. యమగామి లేఖ రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రభావంతో.. తన కేబినెట్‌లో మతపరమైన సమూహంతో సంబంధాలు ఉన్నవాళ్లను తొలగిస్తూ వస్తున్నారాయన. ఇది అక్కడ రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపిస్తోంది. మరోవైపు.. అబే హత్య జరిగిన నలభై రోజుల తర్వాత.. ఘటనకు బాధ్యత వహిస్తూ జాతీయ పోలీసు ఏజెన్సీ చీఫ్ గురువారం తన రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించారు.

ఇదీ చదవండి: అగ్రరాజ్యంలో జాతి వివక్ష దాడి.. ఈసారి భారతీయులపై!

మరిన్ని వార్తలు