మామునూరులో.. ఎగరనున్న విమానం !

1 Aug, 2023 01:48 IST|Sakshi

వరంగల్‌: సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంతో పాటు పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై ఈ కేబినెట్‌లో స్పష్టత ఇచ్చింది.

ప్రధానంగా మామునూరులో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి 253 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఏళ్లతరబడిగా ఎయిర్‌పోర్ట్‌ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన నలుగుతోంది. వెయ్యి ఎకరాల స్థలానికి గాను 270 ఎకరాలు అన్యాక్రాంతం కాగా 730 ఎకరాలకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ఫెన్సింగ్‌ చేసింది.

అయితే మరో 431 ఎకరాలు కావాలని సూచించిన అధికారులు చివరకు 253 ఎకరాలైనా పరవాలేదన్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాల స్థలం ఇచ్చేందుకు కేబినెట్‌లో ఆమోదం తెలపడంతో త్వరలోనే మామునూరు నుంచి విమానాలు ఎగరవచ్చన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్‌ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ఉద్యానవన కళాశాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు..

రోడ్డు రవాణా సంస్థ(ఆర్‌టీసీ)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ విలీనం చేసుకోవడానికి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 3న అసెంబ్లీలో బిల్లు పెట్టి అమల్లోకి తేనున్నారు. దీంతో వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని 9 ఆర్టీసీ డిపోలకు చెందిన 3,627 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు వివిధ కేడర్‌లకు చెందిన కార్పొరేషన్‌ ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

ఉమ్మడి జిల్లాకు ‘వరద’ సాయం..

ఉమ్మడి వరంగల్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణ సహా యక చర్యల కోసం రూ.500 కోట్లు కేబినెట్‌ కేటాయించింది. ఇందులో సుమారు రూ.237 కోట్ల వరకు ఉమ్మడి వరంగల్‌కు దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

గ్రేటర్‌ వరంగల్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సుమారు రూ.587 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు సర్వే చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో వరదల వల్ల రూ.1,000 కోట్లకుపైనే నష్టం జరిగి ఉంటుందని అంచనా. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన 32 మందికి సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా ఈసారి భారీగా నష్టం జరిగిందని అభిప్రాయపడిన మంత్రివర్గం.. అన్ని విధాల అండగా ఉండాలని, సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు