‘శ్రీ శోభకృత్‌’లో సత్యదేవునికి సిరి వృద్ధి

22 Mar, 2023 23:40 IST|Sakshi

అన్నవరం: శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో సత్యదేవునికి ఆదాయం వృద్ధి చెంది స్వామివారి ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందుతుందని ఆలయ ఆస్థాన ప్రధాన వేద పండితుడు బ్రహ్మశ్రీ గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠి తెలిపారు. ఉగాది వేడుకలు రత్నగిరిపై అనివేటి మంటపంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం 9–30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉత్సవమూర్తులను సత్యదేవుని ఆలయం నుంచి ఊరేగింపుగా అనివేటి మంటపం వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం నూతన సంవత్సర పంచాంగాలను స్వామి, అమ్మవార్ల చెంత ఉంచి పండితులు పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు శ్రీ గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠి ‘శోభకృత్‌’ నామ నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను వివరించారు.

సత్యదేవునికి ఆదాయం 14.. వ్యయం రెండు

శ్రీ సత్యదేవునికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం రెండుగా ఉందన్నారు. వ్యయం కన్నా ఆదాయం ఏడు రెట్లు అధికంగా ఉన్నందున దేవస్థానంలో సత్రాలు, నిర్మాణాలు, అభివృద్ధి పధకాలు చేపట్టేందుకు నిధులు దండిగా సమకూరతాయన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు.

వేద పండితులకు సత్కారం

ఉగాది వేడుకల్లో భాగంగా ప్రముఖ వేద పండితులు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరానికి చెందిన గుళ్లపల్లి సుబ్రహ్మణ్య అవధాని, రాజమహేంద్రవరానికి చెందిన ఉప్పులూరి సత్యనారాయణ అవధానిలను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ సత్కరించారు. రూ.5,116 చొప్పున నగదు పారితోషికం, నూతన వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. ఆస్థాన వేదపండితుడు గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠిని సన్మానించి నూతన వస్త్రాలు బహూకరించారు. దేవస్థానం స్మార్త, ఆగమ పాఠశాల విద్యార్థులకు, వారి గురువు నృశింహశర్మకు నూతన వస్త్రాలను బహూకరించారు.

ఘనంగా రథోత్సవం

ఆలయ ప్రాకారంలో స్వామివారి రథోత్సవం కన్నులపండువగా సాగింది. ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చి వెండి రథంపై స్వామి, అమ్మవార్లను ప్రతిష్టించి పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్ఛారణ నడుమ దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఏసీ రమేష్‌ బాబు తదితరులు రథం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు.

సత్యదేవుని రథాన్ని లాగుతున్న చైర్మన్‌ రోహిత్‌, ఎమ్మెల్సీ త్రిమూర్తులు

వేదపండితులను సత్కరిస్తున్న చైర్మన్‌ రోహిత్‌

మరిన్ని వార్తలు