గర్భస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టంపై నిఘా | Sakshi
Sakshi News home page

గర్భస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టంపై నిఘా

Published Thu, Nov 16 2023 6:12 AM

-

జేసీ ఇలక్కియ

కాకినాడ సిటీ: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తూ, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా నిశిత నిఘా కొనసాగించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ హాలులో బుధవారం జేసీ అధ్యక్షతన ఆ చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఇలక్కియ మాట్లాడుతూ జిల్లాలో చట్టం అమలులో భాగంగా చేపట్టిన పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు, డెకాయి ఆపరేషన్లపై సమీక్షించి, వాటిని పటిష్టంగా కొనసాగించాలని డివిజన్‌ స్థాయి కమిటీలకు సూచించారు. అనంతరం రెండు స్కానింగ్‌ సెంటర్లకు అనుమతుల రెన్యువల్‌, ఏడు సెంటర్లకు సంబంధించి అడ్రసు, మెషీన్‌, సిబ్బంది మార్పులకు కమిటీ ఆమోదం జారీ చేసింది. అలాగే పీసీపీఎన్డీటీ చట్టం అమలుకు సంబంధించి జరిపిన వివిధ ఖర్చులను కమిటీ ఆమోదించింది. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో జె.నరసింహనాయక్‌, డీఐవో కె.రత్నకుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో పి.సరిత, సీఐ పి.ఈశ్వరుడు, ఎన్జీవో ప్రతినిధులు చక్రవర్తి, అప్పలనాయుడు, కమిటీ సభ్యులైన జీజీహెచ్‌ హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.

రూ. 2 కోట్లతో

బ్యారేజీ రోడ్డు అభివృద్ధి

రాజమహేంద్రవరం సిటీ: ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డును రూ.2 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆమె మాట్లాడుతూ ఈ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేశారన్నారు. మొత్తం 6.8 కిలోమీటర్ల రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నామన్నారు. ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియ ప్రారంభించామని, 15 రోజుల్లో పనులు ప్రారంభించి నెల రోజుల వ్యవధిలో పూర్తి చేస్తామన్నారు. రహదారిపై ఉన్న తారు రోడ్డును తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తామని, దానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. ఆ పని పూర్తయిన తర్వాత రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు.

Advertisement
Advertisement