రత్నగిరిపై చురుగ్గా కార్తికమాస ఏర్పాట్లు

10 Nov, 2023 05:16 IST|Sakshi
వార్షిక కల్యాణ మంటపంలో వ్రతాలు చేసుకుంటున్న భక్తులు

అన్నవరం: ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న కార్తికమాసం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్నవరం దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ కార్తికమాసం నెల రోజులూ సుమారు 1.60 లక్షల సత్యదేవుని వ్రతాలు జరిగే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్న వ్రత మంటపాలతో బాటు అదనంగా వ్రత మంటపాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రత్నగిరిపై రామాలయం వద్ద గల సత్యదేవుని వార్షిక కల్యాణ మంటపం ముందు గల విశ్రాంతి మంటపాన్ని కూడా సత్యదేవుని వ్రతాలాచరించేదుకు సిద్ధం చేశారు. ఈ విశ్రాంతి మంటపంలో గురువారం ఏకాదశి పర్వదినం సందర్భంగా ట్రయిల్‌ రన్‌ పద్ధతిలో వ్రతాలు నిర్వహించారు. సుమారు 450 వ్రతాలు ఈ మంటపంలో నిర్వహించవచ్చునని నిర్ణయించారు. కార్తికమాసంలోని పర్వదినాలలో ఇక్కడ వ్రతాలు నిర్వహించనున్నారు. వ్రత పురోహిత సంఘం నాయకుడు నాగాభట్ల రవిశర్మ, అల్లంరాజు శ్రీనివాస్‌ తదితరులు ఈ వ్రతాల ఏర్పాట్లు పర్యవేక్షించారు.

పశ్చిమ రాజగోపురం వద్ద

విశ్రాంతి షెడ్డు పనులు ప్రారంభం

పశ్చిమ రాజగోపురం వద్ద ఇటీవల తొలగించిన 30 వీఐపీ సత్రం స్థలంలో భక్తుల విశ్రాంతి షెడ్డు పనులు గురువారం ప్రారంభించారు. 175 అడుగుల పొడవు, 145 అడుగుల వెడల్పున ఇక్కడ భారీ షెడ్డు నిర్మిస్తున్నారు. ఈ షెడ్డులో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. సుమారు రెండు వేల మంది ఇక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ఈ షెడ్డుకు సమీపంలోనే పురుషులు, మహిళలకు విడివిడిగా మరుగుదొడ్లు, స్నానపుగదులు నిర్మిస్తున్నారు. ఈ షెడ్డులో భక్తులకు అందుబాటులో ఉండేలా తూర్పు రాజగోపురానికి ఎదురుగా వ్రతాలు, దర్శనం టిక్కెట్ల విక్రయ కౌంటర్‌, ప్రసాదం కౌంటర్‌, అరటి పండ్లు, కొబ్బరికాయల దుకాణం, ఇతర దుకాణాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ట్రయిల్‌ రన్‌ పద్ధతిలో వార్షిక కల్యాణ

మంటపంలో వ్రతాల నిర్వహణ

450 వ్రతాలు ఏకకాలంలో

నిర్వహించే అవకాశం

మొదలైన విశ్రాంతి షెడ్డు నిర్మాణ పనులు

మరిన్ని వార్తలు