మొసలి దొరికేసింది..!

10 Nov, 2023 05:16 IST|Sakshi
సమసనలో పట్టుబడిన మొసలి

అమలాపురం రూరల్‌: మండలంలోని చల్లపల్లి ప్రధాన పంట కాలువలో నెల రోజులుగా సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మొసలి ఎట్టకేలకు దొరికింది. రిస్క్‌ టీం, స్థానిక మత్స్యకారులు గురువారం రాత్రి మొసలిని బంధించారు. వలలో చిక్కిన మొసలిని కాలువ నుంచి బయటకు తీసుకువచ్చారు. పట్టుకున్న మొసలిని వ్యాన్‌లో ఎక్కించి ఊరేగింపుగా రాజమహేంద్రవరం తరలించారు. నడిపూడి లాకుల వద్ద గత నెల 7వ తేదీన కాలువలో మొసలి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. నడిపూడి లాకుల నుంచి నల్లవంతెన మధ్యగల ప్రధాన పంట కాలవలో మొసలి సంచరిస్తోందంటూ గత నెల 8వ తేదీన మున్సిపల్‌ కమిషనర్‌ నాయుడు ప్రకటించారు. ప్రజలు కాలంలోకి దిగకుండా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. అయితే కొద్ది రోజులకు ఆ మొసలి ఎర్ర వంతెన సమీపంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. దాంతో ఇరిగేషన్‌, అటవీశాఖ అధికారులు కాలువకు అడ్డంగా వలను కట్టి మొసలికి ఆహారంగా కుక్కను కట్టారు. అయినా సరే మొసలి చిక్కలేదు. రాత్రి సమయంలో అది గట్టు మీదకు రావడంతో పలువురు గుర్తించి ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. కొన్నిరోజులకు సమనస లాకుల వద్ద ఆ మొసలి ప్రత్యక్షమైంది. రాత్రి సమయంలో రోడ్డెక్కి కనిపించింది. ఇరిగేషన్‌ అటవీశాఖ అధికారులు మొసలిని బంధించేందుకు బోన్‌ తెచ్చారు. అయినప్పటికీ పట్టుకోలేకపోయారు. ఉన్నతాధికారులు స్పందించారు. మొసలిని పట్టుకునేందుకు జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాదరావు, విశాఖపట్నం నుంచి వచ్చిన డాక్టర్‌ ఫణేంద్ర, నలుగురు సభ్యుల రిస్క్‌ టీం బృందం గురువారం ఉదయం సమనస చేరుకుంది. లాకుల మెండి వద్ద మొసలిని గుర్తించారు. కాలువకు ఇటు, అటు వలలను కట్టి రిస్క్‌ టీం సభ్యులు, స్థానికులు, మత్స్యకారులు వలలతో వేటాడేందుకు దిగారు. మొసలి పట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అది వలలకు చిక్కినట్టే చిక్కి జారుకునేది. సాయంత్రం వరకు మొసలిని బంధించేందుకు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దానిని పట్టుకునేందుకు కోళ్లను కూడా ఆహారంగా వేశారు. అయినా మొసలి చిక్కలేదు. రాత్రైనా సరే మొసలిని పట్టుకుని తీరాలని అధికారులు ప్రయత్నించారు. మొసలి ఉన్న ప్రదేశంలో కాలువకు అడ్డంగా కర్రలు కట్టి ఇసుక బస్తాలతో నీటికి అడ్డుకట్ట వేశారు. గ్రామ సర్పంచ్‌ పరమట శ్యామ్‌ కుమార్‌ అక్కడ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. కాలువకు ఇటు, అటు వలలు వేయడంతో మొసలి చిక్కింది. దాంతో రోడ్డుపైకి చేర్చారు. మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి వ్యాన్‌లో రాజమహేంద్రవరం తరలించారు. దానిని అటవీ ప్రాంతంలో వదులుతామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాదరావు తెలిపారు. మొసలి దొరికిందన్న ఆనందంతో స్థానికులు కేరింతలు కొడుతూ బాణసంచా కాల్చారు.

పట్టుకున్న అటవీశాఖ

అధికారులు, మత్స్యకారులు

ఊపిరి పీల్చుకున్న జనం

మరిన్ని వార్తలు