డిజిటల్‌ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి

19 Nov, 2023 00:16 IST|Sakshi
వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, పక్కన సీపీ వారియర్‌

ఖమ్మం సహకారనగర్‌: శాసనసభ ఎన్నికల నేపథ్యాన డిజిటల్‌ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం సాయంత్రం ఆయన పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా దేశంలోనే అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎన్నికల సంఘం గుర్తించిందని తెలిపారు. ఈ నేపథ్యాన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలను అడ్డుకునేందుకు డిజిటల్‌ లావాదేవీలపై దృష్టి సారించామని చెప్పారు. ఈమేరకు ఓ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్త ఖాతా నుంచి 40మందికి రూ.2,69,256, అదే నియోజకర్గంలోని ఓ బీఆర్‌ఎస్‌ కార్యకర్త ఖాతా నుంచి 43మందికి రూ.1,07,433 ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఒక వ్యక్తి నుంచి పది మందికి పైగా నగదు లావాదేవీలు జరిగితే బ్యాంకర్ల ద్వారా వివరాలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెల్లడించారు.

ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు

తాత్కాలికంగా అందే నగదుకు ఆశపడి యువత, విద్యార్థులు ఇబ్బందుల పాలుకావొద్దని కలెక్టర్‌, సీపీ సూచించారు. ఎన్నికల నేపథ్యాన వివిధ పార్టీల నాయకులు నగదును క్షేత్రస్థాయికి చేర్చి పంపిణీకి యత్నిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, అలాకాకుండా కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు దూరమవుతాయని చెప్పారు. కాగా, పలువురు ఓటర్లకు బంగారు, వెండి ఇచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారన్న సమాచారంతో బంగారం షాపుల్లో ఆర్డర్లపై నిఘా వేశామని తెలిపారు. ఓటర్లు కూడా ఎవరైనా ప్రలోభాలకు యత్నిస్తే వీడియోలు, ఫొటోలు తీసి సీ–విజిల్‌ యాప్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌, సీపీ సూచించారు.

రూ.5.63 కోట్ల నగదు సీజ్‌

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెక్‌ పోస్టుల వద్ద ఇప్పటివరకు రూ.7,24,33,650 విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు, గంజాయి, ఇతర సామగ్రిని స్టీల్‌బాక్స్‌లు ఇతర వస్తువులను సీజ్‌ చేశామని కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ వారియర్‌ తెలిపారు. ఇందులో 248కేసులకు సంబంధించి రూ.5,63,55,937 నగదు ఉందని చెప్పారు. అలాగే, వివిధ కేసులకు సంబంధించిన 9వేలకు మందిని బైండోవర్‌ చేశామని తెలిపారు. అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులు 18ఏర్పాటుచేయగా... అవసరాలకు అనుగుణంగా తనిఖీ బృందాలను పెంచుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు వివరించారు.

డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించాలి

అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఆయన పోలీస్‌ శాఖ, బ్యాంకులు, ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు మరింత విస్తృతం చేయాలని తెలిపారు. ఓటర్లకు పంపిణీ చేసేలా గోదాంలు, ఫంక్షన్‌ హాళ్లలో సామగ్రి నిల్వ చేసే అవకాశం ఉన్నందున నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. అనుమానాస్పద లావా దేవీల నివేదికను బ్యాంకర్లు సమర్పించాలన్నారు. అదనపు డీసీపీ ప్రసాదరావు, డీసీఓ విజయకుమారి, ఎల్‌డీఎం శ్రీనివాసరెడ్డి, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ నాగేంద్రరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

యువత డబ్బుకు ఆశపడి

ఇబ్బందులు తెచ్చుకోవద్దు

కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌,

సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌

మరిన్ని వార్తలు