స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

19 Nov, 2023 00:16 IST|Sakshi
ఓటరు అవగాహన కార్యక్రమంలో బెలూన్లు ఎగురవేస్తున్న అధికారులు
● ప్రలోభాలు ఎదురైతే ఫిర్యాదు చేయండి ● లకారం ట్యాంక్‌ బండ్‌పై ఓటర్లకు అవగాహన

ఖమ్మం మయూరిసెంటర్‌: ఈనెల 30న జరిగే పోలింగ్‌ ప్రతీఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఖమ్మం, పాలేరు అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు తుషార్‌ కాంత మహంతి సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌, ఎన్నికల పోలీస్‌ పరిశీలకులు బ్రిజేష్‌ కుమార్‌ రాయ్‌, కేఎంసీ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి శనివారం ఆయన లకారం ట్యాంక్‌బండ్‌పై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ ఓటు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఎవరు కూడా ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ప్రలోభాలకు గురిచేసే వారి సమాచారాన్ని సీ విజిల్‌ యాప్‌ ద్వారా అధికారులకు చేరవేయాలని కోరారు. అనంతరం ట్యాంక్‌ బండ్‌పై ఎన్‌టీఆర్‌ పార్క్‌ వద్ద సెల్ఫీ పాయింట్‌లో అధికారులు ఫొటోలు దిగడమేకాక సంతకాలు సేకరించి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారి కె.శ్రీరాంతోపాటు అదనపు డీసీపీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

ఖమ్మంరూరల్‌: ఖమ్మం రూరల్‌ మండలం పొన్నేకల్‌లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటుచేస్తున్నారు. ఈమేరకు ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఈవీఎంల భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌, లెక్కింపు రోజును బారికేడ్లు, టేబుళ్ల ఏర్పాట్లు, భద్రతపై ఆరా తీసి సూచనలు చేశారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, అదనపు డీసీపీ ప్రసాద్‌రావు, వివిధ శాఖల అధికారులు శ్రీనివాసులు, సుమ, శ్యాంప్రసాద్‌, విశ్వనాథ్‌, బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు