నేడు భద్రాద్రి జిల్లాకు కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

నేడు భద్రాద్రి జిల్లాకు కేటీఆర్‌

Published Sun, Nov 19 2023 12:16 AM

- - Sakshi

నాలుగు చోట్ల

రోడ్‌ షోలకు ఏర్పాట్లు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు నియోజకవర్గాల్లో జరిగే రోడ్‌ షోల్లో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నాక పట్టణంలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట కు ఇల్లెందుకు చేరుకుని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ హరిప్రియ విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌ షో నిర్వహిస్తారు. అక్కడ కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ మాట్లాడుతారు. అనంతరం 2.30 గంటలకు కొత్తగూడెంలో, సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటలో జరిగే రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు.

24న ఖమ్మంలో...

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న ఖమ్మంలో జరిగే రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారు. ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ తరఫున నిర్వహించే ప్రచారానికి ఆయన హాజరవుతారు. 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఖమ్మంలో కేటీఆర్‌ రోడ్‌ షో ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించారు.

జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదం, స్వామి మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్‌ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఈఓ కె.జగన్మోహన్‌రావు, సూపరింటెండెంట్‌ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

వైరా రిజర్వాయర్‌లోకి సాగర్‌ జలాలు

వైరా: ఎట్టకేలకు వైరా రిజర్వాయర్‌లోకి అధికారులు పాలేరు నుంచి సాగర్‌ జలాలను విడుదల చేశారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట ఎక్స్‌ కేఫ్‌ లాకుల ద్వారా నీటిని విడుదల చేయగా రిజర్వాయర్‌లోకి జలాలు చేరుతున్నాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 9.9 అడుగుల మేర నీరు ఉండగా, పంటలు ఎండిపోతున్నాయని ఇటీవల రైతులు, అఖిలపక్షం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో పాలేరు నుంచి వారం పాటు నీరు విడుదల చేయాలని నిర్ణయించగా.. తాగు, సాగు అవసరాలకు వినియోగించనున్నారు.

సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం

కారేపల్లి: కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లను కారేపల్లిలో అధికారులు శనివారం ప్రారంభించారు. కారేపల్లిలోని లక్ష్మీప్రియ కోటెక్స్‌ జిన్నింగ్‌ మిల్లులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, జిల్లా మార్కెటింగ్‌ అధికారి అబ్దుల్‌ అలీం, ఇల్లెందు మార్కెట్‌ కార్యదర్శి నరేష్‌కుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 1.20లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎనిమిది శాతం తేమ మించకుండా తీసుకొస్తే క్వింటాకు రూ.7,020 ధర లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు, అధికారులు కిరణ్‌, వెంకటేశ్వర్లు, సుంకర కోటేశ్వరరావు, తుమ్మలపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తిమ్మారాపుపేట ఎక్స్‌కేఫ్‌ లాకుల ద్వారా రిజర్వాయర్‌లోకి వస్తున్న జలాలు
1/2

తిమ్మారాపుపేట ఎక్స్‌కేఫ్‌ లాకుల ద్వారా రిజర్వాయర్‌లోకి వస్తున్న జలాలు

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement