వ్యూహాలు.. ప్రతివ్యూహాలు | Sakshi
Sakshi News home page

వ్యూహాలు.. ప్రతివ్యూహాలు

Published Sun, Nov 19 2023 12:16 AM

- - Sakshi

జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి మిగిలిన సమయాన్ని వృథా

చేయకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన

నాయకులు, కార్యకర్తలతో టచ్‌లో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇతర పార్టీలు, స్వతంత్ర

అభ్యర్థుల బలాబలాలపై

ఆరా తీస్తూ పోల్‌ మేనేజ్‌మెంట్‌పై

జోరుగా మంతనాలు

సాగిస్తున్నారు.

– సాక్షిప్రతినిధి, ఖమ్మం

అగ్రనేతలతో ఆకట్టుకునేలా...

పోటీలో ఉన్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఎం అభ్యర్థులు, నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓవైపు అభ్యర్థులు.. మరో పక్క పార్టీ శ్రేణులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీఆర్‌ఎస్‌ నుంచి సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనగా.. మంత్రి కేటీఆర్‌ ఆదివారం భద్రాద్రి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో జరిగే రోడ్డు షోలకు హాజరుకానున్నారు. అలాగే, ఖమ్మంలో 24వ తేదీన జరిగే రోడ్డు షోకు కేటీఆర్‌ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించారు. ఇక ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం పినపాక నియోజకవర్గం మణుగూరులో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. సీపీఎం కూడా మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, సీతారాం ఏచూరి వంటి అగ్రనేతలను రప్పిస్తోంది.

ఓటు బ్యాంక్‌ ఎంత

బరిలో నిలిచిన ఇతర పార్టీలు, స్వతంత్రుల పట్టు, ఓటు బ్యాంకు తదితర అంశాలపై అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి సారించి ఎవరికి నష్టం జరుగుతుందనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. గెలుపోటములను ప్రభావితం చేయగలిగే అంతగా ఓట్లు కొల్లగొట్టే స్థాయిలో స్వతంత్రులు ఉంటే... వారితో ఎవరికి నష్టం జరుగుతుందో అభ్యర్థులు తెలుసుకుంటున్నారు. ఒకవేళ తమకే నష్టమని భావిస్తే స్వతంత్రులతో మాట్లాడి తమ వైపు తిప్పుకోవడం.. ప్రత్యర్థికే నష్టం అనుకుంటే సదరు స్వతంత్ర అభ్యర్థి ప్రచారాన్ని ఉధృతం చేసేలా సహకరించాలనే భావనకు వస్తున్నట్లు తెలిసింది.

ఎన్నికల మంత్రాంగం

అభ్యర్థులు ప్రధానంగా ఎన్నికల మంత్రాంగంపై దృష్టి సారించారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్ది ఏ పోలింగ్‌ స్టేషన్‌లో ఎన్ని ఓట్లు ఉంటాయి.. అక్కడ ఏజెంట్లుగా ఎవరిని నియమించాలనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రధాన అనుచరులతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను బేరీజు వేస్తూ అందుకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రభావితం చేయగలిగే నాయకులకే బాధ్యతలు అప్పగించి రోజూ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. తాము గెలిస్తే చేసే పనులను ఆయా నాయకులకు వివరించి ఓటర్లకు చేరవేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు.

విజయమే లక్ష్యంగా

అభ్యర్థుల ప్రణాళికలు

సమయాన్ని సద్వినియోగం

చేసుకునేలా కసరత్తు

ప్రచారంతోపాటు సమీకరణపై

ప్రత్యేక దృష్టి

ప్రజాబలం కలిగిన నాయకులతో నిరంతరం మంతనాలు

స్వతంత్ర అభ్యర్థుల ప్రభావంపై ఆరా

బలం.. బలహీనతలపై ఆరా

ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్న అభ్యర్థులు.. తమ గెలుపునకు కలిసొచ్చే ఏ అంశాన్నీ విడిచిపెట్టకుండా సమీక్షిస్తున్నారు. ప్రచారానికి పది రోజుల సమయమే ఉండడంతో అనుచరులతో నిత్యం వ్యూహ, ప్రతివ్యూహాలపై చర్చిస్తున్నారు. ఏ గ్రామం, ఏ మండలం, ఏ డివిజన్‌లో ఎక్కువ ఓట్లు వస్తాయి.. ఎక్కడ తక్కువగా పోల్‌ అవుతాయనే లెక్కలు వేసుకుంటున్నారు. బలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు ఏ నాయకుడిని తమ వైపు తిప్పుకోవాలి, అక్కడ ప్రచారం ఎలా చేయాలనే అంశంపై చర్చిస్తూ... ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి బలం, బలహీనతలపై కూడా దృష్టి సారిస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ – కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తుండగా అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా పోరాడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement