‘నకిలీ’ హల్‌చల్‌! | Sakshi
Sakshi News home page

‘నకిలీ’ హల్‌చల్‌!

Published Mon, Nov 13 2023 11:52 PM

కౌటాల పెట్రోల్‌ బంక్‌లో గుర్తుతెలియని వ్యకులు ఇచ్చిన నకిలీ నోటు - Sakshi

కౌటాల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం ఎదుట ఉన్న పెట్రోల్‌ బంక్‌లో ఈ నెల 3న రూ.500 నకిలీ నోటు వెలుగులోకి వచ్చింది. అలాగే తలోడి చౌరస్తాలోని మరో బంక్‌లో ఈ నెల 4న సిబ్బందికి రూ.500 నకిలీ నోటు కనిపించింది. ప్రతిరోజూ రూ.50, రూ.100ల నకిలీ నోట్లు వస్తున్నాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

కౌటాల(సిర్పూర్‌): జిల్లాలో నకిలీ నోట్ల చలామణి మళ్లీ మొదలైంది. నోటును నిశితంగా పరిశీలిస్తే ఏది నకిలీ.. ఏది అసలు అనేది తేల్చుకోలేని పరిస్థితి. అక్రమార్కులు నోట్లకట్టల్లో వీటిని జొప్పించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ నోట్లతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కష్టపడి సంపాదించిన డబ్బుల్లో చెల్లని నోట్లు ఉన్నాయని తెలిస్తే ఆందోళన తప్పదు. పదేళ్ల కిందట నకిలీ నోట్లతో లావాదేవీలు ఎక్కువగా జరిగేవి. అప్పట్లో వాంకిడి మండలంలో రూ.లక్షల్లో నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు అనంతరం కొన్నేళ్ల పాటు తగ్గినా ఇప్పుడు మళ్లీ జోరందుకుంది.

కౌటాలలో వెలుగులోకి..
కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌లో కొత్త నోట్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రూ.2000 నోటును సైతం ఆర్‌బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం అవి కూడా కనిపించడం లేవు. దీంతో అక్రమార్కులు రూ.500 నోట్లపై దృష్టి సారించారు. పెట్రోల్‌ బంకులు, కిరాణా షాపులు, బట్టల దుకాణాలు, మెడికల్‌ షాపులు ఇలా ప్రతిచోట్లా నోట్లు చలామణి చేస్తున్నారు. తాజాగా కౌటాలలోని పెట్రోల్‌ బంకుల్లో రూ.500, రూ.50, రూ.100 నకిలీ నోట్లను నిర్వాహకులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కౌటాల మండలంలో ఎక్కువగా రూ.500ల నకిలీ నోట్ల చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.

చలామణిని అరికట్టాలి
కౌటాలలోని బంక్‌లో ఇటీవల రూ.500 నకిలీ నోట్లు వచ్చాయి. ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. నకిలీ నోట్ల చలామణిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఇటీవల నకిలీ నోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– సత్తయ్య, పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగి, కౌటాల

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కౌటాలలో నకిలీనోట్ల చలామణి విషయం మా దృష్టికి రాలేదు. దొంగనోట్ల చలామణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కరెన్సీ నోట్లతో అక్రమ దందా చేస్తే కేసు నమోదు చేస్తాం. ప్రత్యేక నిఘా వేసి చలామణిని కట్టడి చేస్తాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. దొంగనోట్లు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి.
– కరుణాకర్‌, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

1/1

Advertisement
Advertisement