పరిశీలన పూర్తి | Sakshi
Sakshi News home page

పరిశీలన పూర్తి

Published Mon, Nov 13 2023 11:52 PM

సిర్పూర్‌(టి)లో నామినేషన్‌ పత్రాలు పరిశీలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి దీపక్‌ తివారి - Sakshi

● వివిధ కారణాలతో ఎనిమిది నామినేషన్లు తిరస్కరణ ● 15 వరకు ఉపసంహరణకు గడువు

సాక్షి, ఆసిఫాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసింది. శాసనసభ ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలతోపాటు వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు(ఆర్వోలు) సోమవారం పరిశీలించారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో దాఖలైన నామినేషన్లను స్క్రూటినీ పూర్తిచేసి ఆమోద ముద్ర వేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 64 నామినేషన్లు దాఖలుగా కాగా ఎనిమిది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు.

వివిధ కారణాలతో తిరస్కరణ

ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభమై 10వ తేదీతో ముగిసింది. సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి 31 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా.. ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి 33 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలనలో భాగంగా నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. సిర్పూర్‌లో ఐదు నామినేషన్లు, ఆసిఫాబాద్‌లో మూడు నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లతోపాటు బీ ఫారాలు సమర్పించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు కోవ లక్ష్మి, అజ్మీరా శ్యాంనాయక్‌, అజ్మీరా ఆత్మారాంనాయక్‌, కనక ప్రభాకర్‌, కోనేరు కోనప్ప, డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు, రావి శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను ఆయా పార్టీల నుంచి అధికారిక అభ్యర్థులుగా గుర్తించారు. బీఫారాలు సమర్పించకపోవడం, నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేయని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

సిర్పూర్‌లో ఐదు తిరస్కరణ

సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సోమవారం స్క్రూటినీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం ఐదు నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి దీపక్‌ తివారి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన కోనేరు కృష్ణారావు బీఫారం సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరించారు. అలాగే ఆలైన్స్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రీ ఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థి వెంకటేష్‌ దాసరి, ఆబాద్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన నందిపేట్‌ విలాస్‌, స్వతంత్రులు కాసనగొట్టు సంతోష్‌, తబ్బని ముక్తేష్‌ల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి పేర్కొన్నారు.

15 వరకు ఉపసంహరణ

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు అవకాశముంది. నామినేషన్లను దాఖలు చేసిన అభ్యర్థులకు ఎవరికై నా బరిలో నిలిచే ఉద్దేశం లేకపోతే వారు తమ నామినేషన్లను ఉససంహరించుకోవచ్చు. రెబల్స్‌గా నామినేషన్ల దాఖలు చేసిన అభ్యర్థులతో వివిధ పార్టీలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఈ రెండు రోజులపాటు బుజ్జగింపుల పర్వం కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారో తేలనుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటారన్న విషయంపై స్పష్టత రానుంది. ఆ తర్వాత అధికారులు తుది జాబితా ప్రకటిస్తారు. బరిలో నిలిచే స్వతంత్రులకు గుర్తులు కేటాయించనున్నారు.

సిర్పూర్‌లో ఆమోదం పొందిన నామినేషన్లు

అభ్యర్థి పార్టీ

కోనేరు కోనప్ప బీఆర్‌ఎస్‌

రావి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌

పాల్వాయి హరీశ్‌బాబు బీజేపీ

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీ

కామెర నగేష్‌ ఇండియన్‌ ప్రజా బంధు పార్టీ

కోబ్రగడే గంతీదాస్‌ న్యూ ఇండియా పార్టీ

జె.దీపక్‌కుమార్‌ రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా

ఆర్‌.అజయ్‌కుమార్‌ ప్రబుద్ధ రిపబ్లికన్‌ పార్టీ

జాడి శ్యాంరావు భారతా ప్రజాకీయ పార్టీ

లలిత్‌ భల్‌హోత్రా యుగ తులసీ పార్టీ

డోంగ్రి ప్రవీణ్‌కుమార్‌

ఆల్‌ ఇండియా ఫార్వడ్‌ బ్లాక్‌ పార్టీ

పర్చాకి కేశవ్‌రావు గోండ్వాన గణతంత్ర పార్టీ

సోదారి నిరంజన్‌ సోషలిస్ట్‌ పార్టీ

దాసరి వెంకటేశ్‌ స్వతంత్ర

దుర్గం శ్యాంరావు స్వతంత్ర

దేశగణి సాంబశివగౌడ్‌ స్వతంత్ర

ఎల్ములే మనోహర్‌ స్వతంత్ర

1/1

Advertisement
Advertisement