అమెరికా నుంచి టూరిస్టులను తెచ్చిపెట్టిండ్లు

25 Nov, 2023 12:20 IST|Sakshi

రాయపర్తి: ‘నాపై పోటీకి అభ్యర్థులే కరువయ్యారు.. అమెరికా నుంచి టూరిస్టులను తీసుకువచ్చి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెట్టిండ్లు’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. శుక్రవారం మండలంలోని తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహాన్‌పల్లి, కాట్రపల్లి, మొరిపిరాల, కిష్టాపురం, మహబూబ్‌నగర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలినడకన ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్‌ అని తేల్చిచెప్పారు.

తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశా రు. సేవ చేశానే తప్ప అవినీతి పేరు తెచ్చుకోలేదు.. దయాకర్‌రావు హామీ ఇచ్చాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశాను.. కొత్తగా చేర్చిన హామీల ప్రకారం ప్రతి గ్రామంలో వంద డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా.. పదివేల మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించి సంగెం టెక్స్‌టైల్‌ పార్కులో ఉద్యోగ అవకాశం కల్పిస్తా.. తిర్మలాయపల్లి, తొర్రూరులో ఆయిల్‌పాం మిల్లు పెట్టిస్తున్నాను.. అందులో వెయ్యిమందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు.

గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేశాను.. కొడకండ్లలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయించాను.. గ్రామాల్లో ఉన్న కోతులను పట్టించి ఏటూరునాగారం అడవుల్లో వదలడమే కాకుండా అక్కడ కోతులకోసం పండ్ల మొక్కలను నాటించానని వివరించారు. ఆదరించి గెలిపిస్తే మీముందుకు వచ్చి మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఉషాదయాకర్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల ఎన్నికల ఇన్‌చార్జ్‌ గుడిపూడి గోపాల్‌రావు, మండల అధ్యక్షుడు మూనావత్‌ నర్సింహానాయక్‌, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్‌, పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్‌రావు, పూస మధు, వనజారాణి, ఎండీ.నయీం, గబ్బెట బాబు, సర్పంచ్‌, ఎంపీటీసీలు గారె నర్సయ్య, గజవెల్లి అనంత, రాధిక, ఐత రాంచందర్‌, కర్ర సరితరవీందర్‌రెడ్డి, కుక్కల భాస్కర్‌, గాదె హేమలత పాల్గొన్నారు.

పద్మశాలి సంఘం మద్దతు
కొడకండ్ల:
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మండల పద్మశాలి సంఘం మద్దతు తెలిపింది. అధ్యక్షుడు పసునూరి మధుసూదన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కులస్తులు మంత్రిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

సొంత గూటికి చేరిన కార్యకర్తలు
పాలకుర్తి : మండలం నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు కార్యకర్తలు కళాకారుడు చిరుపాటి ఎల్ల్ల స్వామి, రాజు మరో 20 మంది తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు శుక్రవారం వారిని మంత్రి దయాకర్‌రావు సతీమణి, ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఉషాదేవి స్వాగతించి కండువాలు కప్పారు. పాలకుర్తి వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు, ముదిరాజ్‌ సంఘం నాయకుడు మామిండ్ల శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
దేవరుప్పుల :
పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధించాలని కోరుతూ.. కామారెడ్డిగూడెం మసీదులో శుక్రవారం ముస్లింలు మతగురువు ఇనాయత్‌ రసూల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకులు ఖాసీం, జాకీర్‌, ఖలీల్‌, షబ్బీర్‌, మీరాన్‌, అర్జుమాన్‌, మౌలానా, పాషా, యాకూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు