అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి

Published Sat, Nov 25 2023 1:16 AM

- - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: ‘నేను ఏం చేశాను అనేది గొప్పలు చెప్పుకోవడం కాదు.. చేసిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా.. ఇంటి ముందు వస్తే నేను ఎదురుగా ఉన్నాను. గడిచిన రెండు పర్యాయాలు అభివృద్ధి చేసిన ఇప్పుడు మళ్లీ ప్రజల ఆశీర్వాదం కోరుతున్నాను. కంటి ముందు అభివృద్ధిని చూసి.. ఇంటి ముందుకు వచ్చిన నాకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను’ అని మానుకోట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

పనితనమే అండ..

పదేళ్లక్రితం మానుకోట నియోజకవర్గం ఎలా ఉండేది.. ఇప్పుడెలా మారిందనేదే నా పనితనానికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా నన్ను గుర్తించిన మా అధినాయకులు కేసీఆర్‌ 2014లో తొలిసారిగా పార్టీ టికెట్‌ ఇచ్చారు. కేసీఆర్‌ దయ, ప్రజల ఆశీస్సులతో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచాను. మరోసారి ఆశీర్వదించాలి.

కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు..

తెలంగాణ సాధించుకున్న తర్వాత మారుమూల ప్రాంతమైన మానుకోటను జిల్లాగా మార్చాను. దీంతో కలెక్టరేట్‌, ఎస్పీ, అనుబంధ కార్యాలయాలు జిల్లాకు వచ్చాయి. ఇతర జిల్లాల కన్నా సర్వాంగసుందరంగా కలెక్టరేట్‌ను నిర్మించుకున్నాం. అదేవిధంగా వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్‌, నర్సింగ్‌ కళాశాల నిర్మాణం చేపట్టాం. దీంతో అనుబంధ 330 పడలక ఆస్పత్రి వచ్చింది. పేదవాడికి మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుతోంది. రూ.60లక్షలతో ఆస్పత్రి అభివృద్ధి, రూ. 49లక్షలతో ఐసీయూ వార్డును నిర్మించుకున్నాం. అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, హార్టికల్చర్‌ కళాశాల, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలల నిర్మించుకున్నాం.

ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు

మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ది సంక్షేమ పాలన. ఆయన పెంచిన ఆసరా పింఛన్లు మొదలుకొని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, దళితబంధు, బీసీబంధు, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. ప్రతీ నెల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేస్తున్నాం. ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా వెళ్లని గూడూరు మండలంలోని మారుమూల గ్రామం దొరవారితిమ్మాపురం వెళ్లి అక్కడి స్థితిగతులు, అవసరాలు తెలుసుకున్నాను. వారికి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును నేరుగా చూసి వచ్చాను.

సర్వాంగ సుందరంగా..

నియోజకవర్గంలోని మహబూబాబాద్‌ పట్టణంతో పాటు గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు మండలాలు, గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాను. పట్టణంలో రూ. 3కోట్లతో గ్రంథాలయం నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చాం. ప్రతీ రోడ్డును విశాలంగా మార్చాం. పట్టణ ప్రజల అభిరుచికి అనుగుణంగా వెజ్‌, నాన్‌వెజ్‌, పూలు, పండ్ల మార్కెట్‌ నిర్మించాం.

మారిన మానుకోటే నా పనితనానికి నిదర్శనం

ప్రతీ ఇంటికి చేరిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు

కేసీఆర్‌ దయ, ప్రజల ఆశీస్సులే శ్రీరామ రక్ష

కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు మండలాల్లో అభివృద్ధి

‘సాక్షి’తో మానుకోట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌

కారు గుర్తుకు ఓటేసి సేవచేసే భాగ్యం కల్పించాలి

ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా. నేను నాయకుడిగా కాకుండా సేవకుడిగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతోపాటు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఆశీస్సులతో నిధులు తెచ్చి అభివృద్ధి చేశా. రెండుసార్లు నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. మళ్లీ ఆశీర్వదిస్తారనే నమ్మకంతో మీ ముదుకు వస్తున్నా. ఈనెల 30వ తేదీన కారు గుర్తుపై ఓటేసి మరోసారి మీకు సేవచేసే భాగ్యం కల్పించాలి.

1/1

Advertisement
Advertisement