BAFTA 2023: ‘బాఫ్తా’ నామినేషన్ల తుది జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు దక్కని చోటు

20 Jan, 2023 05:38 IST|Sakshi

ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రతిష్ఠాత్మక ‘బాఫ్తా’ (బ్రిటీష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌  ఆర్ట్స్‌) అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రకటించిన ‘బాఫ్తా’ తుది నామినేషన్ల జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి చోటు దక్కలేదు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ‘బాఫ్తా’ నాన్‌  ఇంగ్లిష్‌ లాంగ్‌లిస్ట్‌ కేటగిరీలో చోటు దక్కించుకుంది. అయితే టాప్‌ 5తో కూడిన ఫైనల్‌ లిస్టులో స్థానం కోల్పోయింది.

తుది నామినేషన్ల జాబితాలో ‘ఆల్‌ ౖక్వైట్‌ ఆన్‌  ద వెస్ట్రన్‌  ఫ్రంట్, అర్జెంటీనా 1985, కోర్సేజ్, డెసిషన్‌  టు లీవ్, ద క్వయిట్‌ గర్ల్‌’ చిత్రాలు నిలిచాయి. కాగా ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ’ విభాగంలో ఇండియన్‌  డాక్యుమెంటరీ ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’కి నామినేషన్‌  దక్కింది. మొత్తం 24 విభాగాల్లో నామినేషన్లు ప్రకటించగా, భారతదేశం నుంచి ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ మాత్రమే నామినేషన్‌  దక్కించుకుంది. షౌనక్‌ సేన్‌  దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 19న ‘బాఫ్తా’ అవార్డుల వేడుక జరగనుంది. మరి.. ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ అవార్డు కూడా గెలుచుకుంటుందా? చూడాలి.

మరిన్ని వార్తలు