నేటితో ఇండస్ట్రీలో 42 ఏళ్లు పూర్తి.. చిరు భావోద్వేగం

22 Sep, 2020 15:16 IST|Sakshi

మెగస్టార్‌ చిరంజీవి.. ఇండస్ట్రీలోనే కాదు సమాజంలో కూడా ఎందరికో ఆదర్శం. ఓ సామన్య కుటుంబంలో జన్మించి.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే మెగాస్టార్‌ రేంజ్‌కి ఎదిగి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో కృషి, శ్రమ, పట్టుదల అవసరం. ఇవన్ని ఉన్నాయి కనుకే ఆయన జీవితం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఎన్నో ఆటుపోట్లని దాటుకుని.. సిని పరిశ్రమలో ఉన్నత స్థానానికి చేరారు చిరంజీవి. నేటితో ఆయన సినీ ప్రయాణం 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆయన నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ 1978, సెప్టెంబర్‌ 22న విడుదలైంది. మంచి విజయాన్ని సాధించింది. కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయసుధ, రావుగోపాల్‌రావు, చంద్రమోహన్‌, చిరంజీవి, రేష్మా రాయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో చిరంజీవిది ముఖ్యమైన పాత్ర. పల్లెటూరి యువకుడిగా చిరు మెప్పించారు. ‘ప్రాణం ఖరీదు’ చిరంజీవికి నటుడిగా ప్రాణం పోసిందనే చెప్పాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరు ట్వీట్‌ చేశారు. (చదవండి: సన్యాసిలా ఆలోచించగలనా?)

‘నా జీవితంలో ఆగస్ట్‌ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో సెప్టెంబర్‌ 22కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆగస్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకుంటే.. సెప్టెంబర్‌ 22 నటుడిగా ‘ప్రాణం’ పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి.. ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికి, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అంటూ చిరు ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్‌ అవుతోంది. ‘ప్రాణం ఖరీదు’ నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆచార్య’ వరకు తన 42 ఏళ్ల కెరీర్‌లో చిరంజీవి 152 సినిమాల్లో నటించారు. దాదాపు అన్ని జాన‌ర్‌ల‌లో న‌టిస్తూ ప్రేక్షకులను ఆలరించారు. ఇటీవ‌ల వ‌చ్చిన ‘సైరా’ చారిత్రాత్మ‌క చిత్రంతో ఇన్నాళ్లు ఉన్న లోటుని కూడా తీర్చేసుకున్నారు. ఆయన మరెన్నో మంచి చిత్రాలు చేయాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 

>
మరిన్ని వార్తలు