మహారాజా సుహేల్‌ దేవ్‌గా రామ్‌చరణ్‌!

8 Jul, 2022 09:38 IST|Sakshi

‘మగధీర’ సినిమాలో తన రాజ్యాన్ని కాపాడుకునే పోరాట యోధుడు కాల భైరవ పాత్రలో రామ్‌చరణ్‌ని చూశాం. ఇప్పుడు చరణ్‌ని మహారాజా పాత్రలో చూసే చాన్స్‌ ఉందని టాక్‌. వార్తల్లో ఉన్న ప్రకారం 11వ శతాబ్దానికి చెందిన రాజా సుహేల్‌ దేవ్‌ పాత్రను రామ్‌చరణ్‌ చేయనున్నారని తెలిసింది. ప్రముఖ రచయిత అమిష్‌ త్రిపాఠి రాసిన లెజెండ్‌ ఆఫ్‌ సుహేల్‌ దేవ్‌: ది కింగ్‌ హూ సేవ్డ్‌ ఇండియా’ పుస్తకం ఆధారంగా ఓ సినిమాని గతంలో ప్రకటించారు. రెండేళ్ల క్రితం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులను ఆరంభించారు కూడా. అయితే కరోనా బ్రేక్‌ వల్ల ఈ సినిమాకి బ్రేక్‌ పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి అమిష్‌ త్రిపాఠి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

సుహేల్‌ దేవ్‌ పాత్ర కోసం అక్షయ్‌ కుమార్‌ పేరుని పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్ర కోసం ఇటీవల రామ్‌చరణ్‌ని సంప్రదించారట. చరణ్‌ కూడా ఈ చిత్రంలో నటించడానికి సుముఖంగా ఉన్నారని భోగట్టా. ఇక రాజా సుహేల్‌ దేవ్‌ విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తికి చెందిన రాజు ఆయన. బహ్రైచ్‌లో గజనీ సైన్యానికి చెందిన మొహమ్మద్‌ను ఓడించారు రాజు సుహేల్‌ దేవ్‌. ఈ యుద్ధంతో పాటు 11వ శతాబ్దంలో భారతదేశంపై టర్కీ చేసిన పలు దాడుల నేపథ్యంలో అమిష్‌ త్రిపాఠి ఈ సినిమా నిర్మించనున్నారు. మరి.. సుహేల్‌ దేవ్‌ పాత్రను రామ్‌చరణ్‌ చేస్తారా? ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనేవి తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరిన్ని వార్తలు