Sardar Review: ‘సర్దార్‌’ మూవీ రివ్యూ

21 Oct, 2022 16:51 IST|Sakshi
Rating:  

టైటిల్‌: సర్దార్‌
నటీనటులు: కార్తీ, రాశీఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్‌, లైలా, మునిష్కాంత్‌, అశ్విన్‌, బాలాజీ శక్తివేల్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు: ప్రిన్స్‌ పిక్చర్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌
నిర్మాతలు: ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌
దర్శకత్వం: పీఎస్‌ మిత్రన్‌
సంగీతం: జీవీ ప్రకాశ్‌
సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి.విలియమ్స్‌
ఎడిటర్‌: రూబెన్‌
విడుదల తేది: అక్టోబర్‌ 21, 2022

‘సర్దార్‌’ కథేంటంటే..
విజయ్ ప్రకాష్ (కార్తీ) ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటమంటే అతనికి పిచ్చి. పని మీద కంటే మీడియా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తాడు. ఓ రోజు ఆంధ్రా యూనివర్సీటీ నుంచి చాలా ముఖ్యమైన ఫైల్‌ మిస్‌ అవుతుంది. అందులో భారత సైనిక రహస్యాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఫైల్‌ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి సీబీఐ, ‘రా’ అధికారులు రంగంలోకి దిగుతారు. ఈ విషయం విజయ్‌ ప్రకాశ్‌కి తెలుస్తుంది. అతనికి ఫేమ్ రావాలి అనే ఫోబియా కారణంగా సీబీఐ, రా అధికారుల కంటే ముందే ఆ ఫైల్‌ని కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో విజయ్‌కి తన తండ్రి సర్దార్‌ (కార్తి) గురించి, ఆయన చేపట్టిన మిషన్‌ గురించి తెలుస్తుంది. అసలు సర్దార్‌ ఎవరు? ఆయన చేపట్టిన మిషన్‌ ఏంటి? సర్దార్‌పై దేశద్రోహి అనే ముద్ర ఎలా పడింది? చివరకు తండ్రి చేపట్టిన మిషన్‌లో విజయ్‌ ప్రకాశ్‌ ఎలా భాగమయ్యాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా చూపించడంలో దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ దిట్ట. తొలి చిత్రం ‘అభిమన్యుడు’లో బ్యాంక్ మోసాలు, డిజిటల్ మోసాల్లో దాగి ఉన్న నిజాన్ని బయటకు తెచ్చాడు. కమర్షియల్‌ అంశాలను జోడీస్తూనే ‘హీరో’లో కూడా ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ‘సర్దార్‌’లో కూడా ఓ భారీ మోసాన్ని జనాలకు చూపించాడు. నీటి నిర్వాహణను ప్రైవేటీకరణం చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? సమస్త జీవకోటికి ప్రాణధారమైన నీటిని కొంతమంది స్వార్థపరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాన్ని ఓ గూఢచారి కథతో ముడిపెట్టి చూపించాడు. పైప్‌లైన్‌ పేరుతో భారతదేశ నీటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ఓ బడా వ్యాపారవేత్త ప్రయత్నాన్ని​.. దేశద్రోహి ముద్రవేసుకొని, అజ్ఞాతంలో ఉన్న ఓ వ్యక్తి ఎలా అడ్డుకున్నాడు అనేదే సర్దార్‌ కథ.  

సర్దార్‌ పాత్రని పరిచయం చేస్తు కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విజయ్‌ కుమార్‌ని రంగంలోకి దించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ అంతా విజయ్‌ కుమార్‌ చుట్టూ తిరుగుతుంది.  మీడియాలో పడేందుకు అతను చూపించే ఆసక్తి, హీరోయిన్‌తో ప్రేమాయణం ఇలా సాదాసీదాగా సాగుతుంది. సామాజిక కార్యకర్త సమీరా (లైలా) మరణంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. సర్దార్‌ ప్లాష్‌బ్యాక్‌, అతను చేపట్టిన మిషన్‌ సంబంధించిన సన్నివేశాలతో సెకండాఫ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఇలాంటి కథలు మనకు కొత్తేమి కాదు. ఒక గూఢచారి దేశం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేస్తాడు? అనేది గతంలో చాలా సినిమాల్లో చూపించారు.  ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా గత సినిమాల మాదిరే ఉంటుంది. కానీ కార్తి పాత్రలని తీర్చిదిద్దిన విధానం బాగుంది.

ఎవరెలా చేశారంటే...
ఈ సినిమాలో కార్తి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. పోలీసు అధికారి విజయ్‌ కుమార్‌గా, 60 ఏళ్ల వయసుపైబడిన గూఢచారి సర్దార్‌గా రెండూ పాత్రలను అద్భుతంగా పోషించాడు. అతని బహుళ గెటప్‌లను మెచ్చుకోవాలి. లాయర్‌ షాలినిగా రాశీఖన్నా ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు నిడివి తక్కువనే చెప్పాలి. సామాజిక కార్యకర్త సమీరాగా లైలా తనదైన నటనతో ఆకట్టుకుంది. విలన్‌గా చుంకీ పాండే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్‌ సంగీతం బాగుంది. తమిళ ఫ్లేవర్ కారణంగా తెలుగు పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ, రూబెన్‌ ఎడిటింగ్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:  
(3/5)
మరిన్ని వార్తలు