విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం

20 Aug, 2020 02:21 IST|Sakshi

తమిళసినిమా (చెన్నై):   కరోనాతో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరంతో వైద్యం చేస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన కోలుకునే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

బాలు కోసం ప్రార్థనలు: ఎస్పీబీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖ నటుడు రజనీకాంత్, కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. బాలు త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేద్దామని దర్శకుడు భారతీరాజా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత కళాకారులతో గురువారం సాయంత్రం 6 గంటలకు ఎస్పీబీ పాటల ద్వారా సామూహిక ప్రార్థనలు చేద్దామని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు