ఏటూరునాగారం: ప్రభుత్వ.....

23 Mar, 2023 02:12 IST|Sakshi

ఏటూరునాగారం: ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలను అక్రమార్కులు కొల్ల గొట్టారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇసుక క్వారీలను నడుపుతున్న కాంట్రాక్టర్లు.. భాగస్వాముల లారీలే అధికంగా ఉన్నాయి. దీంతో ఆ లారీలను నేరుగా క్వారీలకు పంపించి వే బిల్లులు, డీడీలు లేకుండానే ఇసుకను తరలించే విధంగా అక్రమార్కులు పక్కా ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగానే వాజేడు, వెంకటాపురం(కె), మంగపేట, మణుగూరు తదితర ప్రాంతాల్లో ఉన్న 24 క్వారీల నుంచి వందలాది లారీల ఇసుక తరలివెళ్లింది.

నిబంధనలు ఇలా..

గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఎండీసీ ద్వారా గోదావరిలో ఇసుక ఉన్న ప్రాంతాలను గుర్తించింది. వాటిని మండల, డివిజన్‌, జిల్లా స్థాయి కమిటీల ద్వారా తీర్మాణాలను చేసి స్థానికంగా ఉన్న గిరిజనులను సొసైటీగా ఫాం చేసి ఇసుక క్వారీలను ఏర్పాటు చేసింది. అయితే సొసైటీల వద్ద క్వారీలను నడిపేంత పెట్టుబడి వారికి లేకపోవడంతో ప్రభుత్వం రేజింగ్‌ కాంట్రాక్టర్లను క్వారీ వ్యాపారంలోకి భాగస్వాములు చేసింది. కాంట్రాక్టర్‌ గోదావరిలో ఉన్న ఇసుకను కూలీల ద్వారా ట్రాక్టర్లలో తరలించి డంపింగ్‌ యార్డులో నిల్వ చేయడమే సొసైటీల సభ్యులు చేయాలి. కాంట్రాక్టర్‌ పని మాత్రం డంపింగ్‌యార్డులో ఉన్న ఇసుకను టీఎస్‌ఎండీసీ సిబ్బంది ఆన్‌లైన్‌లో తీసుకున్న డీడీని స్వీకరించి ఆ పరిమాణంతో ఇసుకను లోడింగ్‌ చేసి వే బిల్లు అందించాల్సి ఉంటుంది. కేవలం కాంట్రాక్టర్‌ డంపింగ్‌ యార్డులో ఉన్న ఇసుకను టిప్పర్‌, లారీల్లో లోడింగ్‌ చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది.

గోదావరిలోకి తీసుకెళ్లి..

అయితే ఇక్కడ డంపింగ్‌ చేసే కాంట్రాక్టర్లు తన, భాగస్వాములకు చెందిన లారీలను నేరుగా గోదావరిలోకి తీసుకెళ్లి అక్కడే లోడింగ్‌ చేయించుకొని టీఎస్‌ఎండీసీ సిబ్బందికి ముడుపులు అప్పగించి హైదరాబాద్‌, ఇతర పట్టణాలకు తరలించుకుపోవడం గమనార్హం. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టి ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు, లారీల యజమానులు, టీఎస్‌ఎండీసీ అధికారులు, సిబ్బంది పంచుకుతిన్నారు. ముఖ్యంగా గోదావరి నదిలో ఇసుకను తోడే అనుమతి జేసీబీ, పొక్లెయిన్‌లకు లేదు. కానీ టీఎస్‌ఎండీసీ, పోలీసులు, బీఆర్‌ఎస్‌ నాయకుల అండతో నేరుగా గోదావరిలోనే జేసీబీ, పొక్లెయిన్లు పెట్టి ఇసుకను తోడారు.

పోలీసులు, ప్రభుత్వ అధికారులు

ఇసుక క్వారీ వ్యాపారంలో కోట్ల రూపాయలు గడించవచ్చని అత్యాశకు పాల్పడి కొంత మంది పోలీసులు బినామీ పేర్లతో లారీలను కొనుగోలు చేశారు. వాటిని ఇసుక క్వారీల వద్దకు పంపించి ఫోన్లలో చెప్పించుకొని ఇసుకను డీడీలు, వే బిల్లులు లేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులే కాకుండా ఇతర శాఖల్లో పనిచేసే మరికొంత మంది ఉద్యోగులు కూడా లారీలను ఇసుక క్వారీల్లో పెట్టి వ్యాపారాన్ని కొనసాగించడం విస్మయాన్ని కలిగిస్తోంది.

వే బ్రిడ్జిల నిర్వాహకులతో..

ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి, ధర్మారం, వెంకటాపురం(కె) వద్ద ఉన్న వే బ్రిడ్జిల నిర్వాహకులు సైతం ఇసుక లారీలు, కాంట్రాక్టర్లు, టీఎస్‌ఎండీసీ సిబ్బందితో కుమ్మక్కు అయ్యారు. లారీల్లో అధిక లోడు, వే బిల్లులు లేకున్నా కూడా ముడుపులు అధికంగా తీసుకొని చూసిచూడనట్లు వ్యవహరించారు. ఇందులో భాగంగానే ఇటీవల చిన్నబోయినపల్లికి చెందిన రాజశేఖర్‌ నకిలీ వే బిల్లుల కుంభకోణంలో పట్టుబడ్డారు.

లోడింగ్‌కు రూ.3,500లు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇసుక కొనుగోలు చేసే వ్యక్తి రూ.600లు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంది. సుమారు పది క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు రూ. 6వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో డంపింగ్‌ యార్డులో ఉన్న ఇసుకను టిప్పర్‌, లారీల్లో లోడింగ్‌ చేసేందుకు సొసైటీ సభ్యులు రేజింగ్‌ కాంట్రాక్టర్‌కు రూ.226లు ఒక క్యూబిక్‌ మీటర్‌కు చెల్లించాల్సి ఉంది. కానీ నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టర్లు అదనంగా రూ. 3,500లు కేవలం లోడింగ్‌ చేసేందుకు తీసుకొని లారీలను పంపించడం గమనార్హం. ఈ విషయాన్ని లారీల డ్రైవర్లు టీఎస్‌ఎండీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయింది.

కోట్లు కొల్లగొట్టారు..

ఇసుక అక్రమ రవాణాలో

పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల లారీలే..

టీఎస్‌ఎండీసీ సిబ్బందితో వే బ్రిడ్జిల నిర్వాహకులు సైతం కుమ్మక్కు

వే బిల్లులు, డీడీలు లేకుండానే

వందలాది లారీల ఇసుక తరలింపు

ప్రభుత్వ ఖజానాకు

భారీగా గండి పెట్టిన వైనం

మరిన్ని వార్తలు