యాప్‌లతో ప్రక్షాళన | Sakshi
Sakshi News home page

యాప్‌లతో ప్రక్షాళన

Published Sun, Nov 19 2023 1:16 AM

ఏటూరునాగారంలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌తో హాజరు నమోదు   - Sakshi

జిల్లా సమాచారం:

ప్రాథమిక పాఠశాలలు 266

ప్రాథమికోన్నత పాఠశాలలు 45

ఉన్నత పాఠశాలలు 39

మొత్తం విద్యార్థులు 30,000

ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పారదర్శకంగా పనిచేయించేందుకు యూడైస్‌ ప్లస్‌ ఆన్‌లైన్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌(పీఈఎన్‌)ను విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ శాశ్వత నంబర్‌తో దేశంలోని ఏ పాఠశాలలో అడ్మిషన్‌ పొందినా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలా పీఈఎన్‌ వల్ల ఏ పాఠశాలలో ఎంత మంది చదువుతున్నారు. వారికి ఎంత మేర నిధులు కేటాయించాలి.. వారికి ఎన్ని తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయులు ఎంతమంది, సిబ్బంది ఎంత మంది కేటాయించాలనేది తేలిపోతుంది.

మధ్యాహ్న భోజనం

మధ్యాహ్న భోజనం విషయంలో కొన్ని చోట్ల సిబ్బంది, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం మూలంగా కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. దీనిని అదుపులోకి తీసుకురావడానికి యూడైస్‌ ప్లస్‌లోని పీఈఎన్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. విద్యార్థుల వివరాలతోపాటు.. ఏ పాఠశాలకు ఎంతమంది వస్తున్నారని తేలిపోతుంది.

డీఎస్‌ఈ– ఎఫ్‌ఆర్‌ఎస్‌

పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేసేందుకు ఫేస్‌ రికగ్నైజ్డ్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఆ యాప్‌ ఓపెన్‌ చేసి క్లాస్‌రూంలోని విద్యార్థులను ఒక ఫొటో తీస్తే అటోమెటిక్‌గా ఎంత మంది ఉన్నారు. ఎవరెవరు హాజరయ్యారని తేలిపోతుంది. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థుల హాజరు తేలిపోవడం వల్ల మెయింటనెన్స్‌, మధ్యాహ్న భోజనం, విద్యాబోధన ఎంత మందికి జరుగుతుందనేది వివరంగా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిధులు పక్కదారి పట్టకుండా చూడొచ్చు.

దివ్యాంగుల కోసం ప్రశాస్త్‌

విద్యార్థుల్లో అంగవైకల్యం కలిగిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు, యంత్రాలు, ఇతర వస్తువులు పారదర్శంగా అందడానికి ప్రశాస్త్‌ యాప్‌ను నూతనంగా ప్రవేశపెట్టారు. ఈ యాప్‌లో భవిత సెంటర్‌ టీచర్లు, ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు లాగిన్‌ అయి వారి ఆధార్‌ వివరాలు, వైకల్య లోపం, స్థితిగతులు పూర్తిగా పొందుపర్చుతున్నారు.

టీచర్స్‌, విద్యార్థులకు ఉపయోగకరం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన యూడైస్‌ ప్లస్‌, ప్రశాస్త్‌, ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు, టీచర్లకు సౌకర్యంగా ఉంటుంది. దాని ద్వారా ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు, వారికి అందుతున్న సేవలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఈ యాప్‌లను విధిగా ఉపయోగించాలి.

– బద్దం సుదర్శన్‌రెడ్డి,

జిల్లా విద్యాశాఖ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు శాశ్వత కోడ్‌

దివ్యాంగులకు ప్రశాస్త్‌

1/3

ఫేస్‌ రికగ్నైజ్డ్‌ యాప్‌
2/3

ఫేస్‌ రికగ్నైజ్డ్‌ యాప్‌

ప్రశాస్త్‌
యాప్‌
3/3

ప్రశాస్త్‌ యాప్‌

Advertisement
Advertisement