బ్యాటరీ పరిశ్రమపై భగ్గుమన్న విపక్షాలు

25 Mar, 2023 01:28 IST|Sakshi

కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ నేతల అరెస్టు.. దివిటిపల్లిలో ఉద్రిక్తత

పరిశ్రమకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌ నేతలు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌లో నిషేధించిన అమరరాజా బ్యాటరీ పరిశ్రమను జిల్లాలో నెలకొల్పే అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలు వద్దంటూ మొరపెట్టుకుంటుంటే.. మరోపక్క అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు బ్యాటరీ పరిశ్రమకు మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కాలుష్యాన్ని వెదజల్లే అమరరాజా పరిశ్రమకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన దీక్ష చేపడతామని అందుకు అనుమతించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ నెల 21న పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ నాయకులు శుక్రవారం దివిటిపల్లి, అంబట్‌పల్లి, ఎదిర, సిద్దాయిపల్లి గ్రామాల ప్రజలతో కలిసి దీక్ష చేపట్టేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేశారు. మరోపక్క బ్యాటరీ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నాయకులను ఎక్కడికక్కడే ముందస్తుగా అరెస్టు చేశారు. ఆందోళనకారులను భూత్పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

● ఇదిలా ఉండగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వైస్‌ ఎంపీపీ భర్త పాండురంగారెడ్డి, దివిటిపల్లి సర్పంచ్‌ భర్త ముఖరంజ, నాయకులు బ్యాటరీ పరిశ్రమకు సంఘీభావం తెలిపి పరిశ్రమతో కాలుష్యం కాదని చెబుతూ కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయితే దివిటిపల్లి వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఐటీ టవర్‌ కారణంగా అనేక పరిశ్రమలు ఏర్పాటై తమ పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశించి భూములను అప్పగించామని దివిటిపల్లి, ఎదిర గ్రామాల రైతులు అంటున్నారు. వాస్తవానికి కాలుష్యం వెదజల్లే అమర రాజా పరిశ్రమ తమకు వద్దని వాపోతున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆయా పార్టీల నాయకులు చంద్రశేఖర్‌, కృష్ణయ్య, తిరుపతిరెడ్డి, మురళి, నర్సింహులు, అశోక్‌గౌడ్‌, బాలకృష్ణ, రాఘవేందర్‌, కృష్ణయ్య, రవికుమార్‌, యాదగిరి, శివకుమార్‌ తదితరులున్నారు. కాగా దివిటిపల్లి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దివిటిపల్లి ఐటీ టవర్‌ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ నాయకులు

లిథియం పరిశ్రమకు మద్దతుగా నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

మరిన్ని వార్తలు