ఆత్మగౌరవాన్ని కొనలేరు | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవాన్ని కొనలేరు

Published Wed, Nov 29 2023 12:42 AM

-

మద్దూరు: రేవంత్‌రెడ్డి సీట్లు అమ్ముకున్న డబ్బులతో ఇక్కడి నాయకులను కొనుగోలు చేశాడేమోగానీ.. ఆ డబ్బు సంచులతో కొడంగల్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేడని, రెంటికి చెడ్డ రేవడిలా అటు కామారెడ్డిలో మూడోస్థానం, కొడంగల్‌లో ఓడిపోబోతున్నాడని.. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో 30 స్థానాల్లో అభ్యర్థులే లేరని.. ఇక ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేది సచ్చేది లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దూరులో మంత్రి హరీశ్‌రావు, గనులు, భూగర్భ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి మద్దూరు కొత్తబస్టాండ్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. రేవంత్‌రెడ్డిని కొడంగల్‌ ప్రజలు రెండు సార్లు గెలిపించగా.. అనంతరం ఆయన అందుబాటులో లేకుండా పోయాడని గుర్తుచేశారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి అని అందుకే ఇప్పటి వరకు మోదీని ఒక్క సారి కూడా విమర్శించలేదని, కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే అని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు నరేందర్‌రెడ్డిని గెలిపించి చరిత్ర తిరగరాసి అభివృద్ధిని చూశారని, ఈ సారి కూడా అత్యధిక మెజార్టీతో మళ్లీ పట్నం నరేందర్‌రెడ్డి గెలిపించాలని, పట్నంకు ప్రమోషన్‌ ఇస్తామని మంత్రి అన్నారు. రేవంత్‌రెడ్డి ఓడిపోతున్నాడని కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి స్పష్టం చేశాడన్నారు.

‘పాలమూరు’ ద్వారా

1.45లక్షల ఎకరాలకు సాగునీరు

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఏడాది, రెండేళ్లలోపే కొడంగల్‌ నియోజకవర్గంలోని లక్షా 45 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చంద్రకల్‌ వద్ద ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. మద్దూరు మూడు నెలల్లో మున్సిపాలిటీతోపాటు రోడ్డు విస్తరణ కోసం మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రత్యేక కోటా కింద నియోజకవర్గానికి 10వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసి.. అర్హులందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేస్తామన్నారు.

ప్రజలను మభ్యపెడుతున్నాడు..

: ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తే సీఎం అవుతానంటూ రేవంత్‌రెడ్డి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని.. ఎవరూ నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌ ప్రజలు మరోసారి నన్ను ఆశీర్వదించాలని, మరో ఐదేళ్లు మీకు అందుబాటులో ఉంటానన్నారు. సీఎం కేసీఆర్‌ కాలి గోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోడని, ఆయనకు సవాల్‌ విసరడం కాదు ముందు నాపై గెలిచి చూపించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బాల్‌సింగ్‌నాయక్‌, సలీం, వెంకటయ్య, అరుణ, జగదీశ్వర్‌, శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

కర్ణాటకలోనే ‘గ్యారంటీలు’ అమలు చేయలే..

ఆర్నెళ్ల క్రితం కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకొస్తే ఇచ్చిన 5 గ్యారెంటీలను అమలు చేయలేదని, కావాలంటే మీ ఆ రాష్ట్రంలో ఉన్న మీ బంధువులను అడిగి తెలసుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ ఇస్తే చాలని అంటున్నాడు, సరిపోతుందా అని రైతులను ప్రశ్నించారు. అక్కడ 2.5 లక్షల ఉద్యోగాలు 100 రోజుల్లో ఇస్తానని ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్‌ వేయలేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే పింఛన్‌ రూ.5 వేల వరకు పెంపు, సన్నబియ్యం, ఎకరాకు రూ.16 వేల రైతు బంధు, బీమా అమలు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.

Advertisement
Advertisement