శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తాం

26 Nov, 2023 01:40 IST|Sakshi
అమిత్‌షాను పూలమాలతో సత్కరిస్తున్న బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు

కొల్లాపూర్‌: ‘కమలాన్ని గెలిపించండి.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అవినీతికి, మైనార్టీలకు, ఒక అవినీతి కుటుంబానికి వేసినట్లే’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. శనివారం కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్పసభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్రీరంగాపూర్‌ రంగనాయకస్వామి, సింగోటం లక్ష్మీనరసింహస్వామి, మియాపూర్‌ సత్యమ్మ దేవత, నాయినోనిపల్లి మైసమ్మ దేవతకు నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. శ్రీశైలం నిర్వాసితులకు కేసీఆర్‌ ఏమీ చేయలేదని, బీజేపీని గెలిపిస్తే కచ్చితంగా వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వెల్టూరు– గొందిమల్ల ప్రాజెక్టును పూర్తిచేస్తామని, మామిడి ప్రాసెసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి, కొల్లాపూర్‌ మామిడిని యూరప్‌ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. అలాగే వాల్మీకి బోయలు, మాదాసి కురువల డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని, వెనకబడిన వర్గాల ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్ల వల్ల మాదిగ సమాజానికి మేలు జరుగుతుందని, త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టి.. ఆ సమస్యకు ముగింపు పలుకుతాం ప్రకటించారు. రూ.2,400 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారి, సోమశిల వంతెన 18 నెలలో పూర్తి చేస్తామని వివరించారు. కొల్లాపూర్‌ యువత గురించి కేసీఆర్‌ పట్టించుకోడని, బీజేపీ వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కొల్లాపూర్‌లో కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థి సుధాకర్‌రావును గెలిపించాలని ఓటర్లను కోరారు.

కొల్లాపూర్‌ను నంబర్‌వన్‌ చేస్తా..

ఇద్దరు తోడుదొంగలు.. ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటారు. మంది ముందు నాటకాలు ఆడతారు.. ఇద్దరిది మొన్నటి వరకు ఒకటే పార్టీ.. అధికారంలోకి ఏ పార్టీ వస్తే దానిలోకి ఇద్దరూ పోతారు అంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డిలపై బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు విమర్శించారు. జాతీయ రహదారి, సోమశిల వంతెన బీజేపీ ద్వారానే సాధ్యమైందని, ఇందుకు కేంద్రానికి కొల్లాపూర్‌ రుణపడి ఉంటుందన్నారు. ఒక్కసారి బీజేపీకి కొల్లాపూర్‌ ప్రజలు అవకాశం ఇస్తే అలంపూర్‌ నుంచి కొల్లాపూర్‌ మీదుగా దేవరకొండ వరకు జాతీయ రహదారి మంజూరు చేయిస్తానని, కొల్లాపూర్‌కు రైల్వేలైన్‌ తీసుకొస్తానని, ఇండస్ట్రీయల్‌ పార్కు తెస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇవన్నీ బీజేపీతోనే సాధ్యమవుతాయన్నారు. నీతిగా, నిజాయితీగా పనిచేస్తానని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని సుధాకర్‌రావు కోరారు. కార్యక్రమంలో నాయకులు నరేష్‌, శ్రీనివాస్‌యాదవ్‌, శేఖర్‌గౌడ్‌, జలాల్‌ శివుడు, అక్కల రామన్‌గౌడ్‌, రోజారమణి, సింగోటం రామన్న, మూలె భరత్‌చంద్ర, అన్వేష్‌, గంగం మల్లేష్‌యాదవ్‌, జనసేన నియోజకవర్గ అధ్యక్షుడు సాంబశివుడు పాల్గొని పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు