నమీబియా నుంచి మరో 12 చీతాలు వస్తున్నాయ్‌..

17 Feb, 2023 08:20 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో చీతాల సంఖ్యను పెంచే లక్ష్యంతో వాటిని దక్షిణాఫ్రికా ఖండం నుంచి రప్పిస్తున్న మోదీ సర్కార్‌ ఈ దఫాలో 12 చీతాలను వాయుమార్గంలో తీసుకొస్తోంది. నమీబియా దేశం నుంచి 12 చీతాలను ఫిబ్రవరి 18వ తేదీన తీసుకొస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ గురువారం చెప్పారు. ‘ నమీబియా నుంచి వాటిని తెచ్చేందుకు సీ–17 విమానం గురువారం బయల్దేరింది.

భారత్‌కు తెచ్చాక వాటిని ఉంచేందుకు మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కులో 10 క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్‌లను సిద్ధంచేశాం’ అని మంత్రి చెప్పారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ తన పుట్టినరోజున కూనో పార్కులోకి ఐదు ఆడ, మూడు మగ చీతాలను విడిచిపెట్టిన విషయం విదితమే. భారత్‌లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు భారత సర్కార్‌ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తున్నారు.
చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు నిజర్వ్‌..

మరిన్ని వార్తలు