పుస్తకాలు తెరవడం లేదు.. స్కూల్స్‌ ఓపెన్‌ చేయాల్సిందే!

8 Sep, 2021 19:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

37% అసలు పుస్తకాలు తెరవడం లేదు

పదాలను కూడా చదవలేని వైనం

విద్యార్థులపై కరోనా ప్రభావం

తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విద్యార్థుల జీవితాల్లో సృష్టించిన అగాధం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. గ్రామీణ విద్యార్థుల్లో చాలా మంది అసలు పదాలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. స్కూల్‌ చిల్డ్రన్‌ ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌ లెర్నింగ్‌ (స్కూల్‌) అనే సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఆగస్టు నెలలో 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 1400 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం సాగింది. పాఠశాల విద్యపై అత్యవసర నివేదిక అనే అంశంపై జరిగిన ఈ అధ్యయనం సోమవారం విడుదలైంది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: ఎన్‌డీఏలో మహిళల ప్రవేశాలకు అనుమతి)


37 శాతం మంది చదవట్లేదు..

గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం మంది విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుతుండగా, 37 శాతం మంది మాత్రం అసలు చదవడం లేదు. ఇందులో దారుణమైన వాస్తవమేమిటంటే కొంత మంది విద్యార్థులు వాక్యంలోని పదాలను సైతం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. పట్టణ పఆరంతాల్లో క్రమం తప్పకుండా చదువుతున్న వారు 47శాతం, అసలు చదవని వారు 19శాతం, కొన్ని పదాలకు మించి చదవలేని వారు 42 శాత ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. ఆన్‌లైన్‌ విధానం ద్వారా క్రమం తప్పకుండా చదివేవారు పట్టణాల్లో 24 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతం మాత్రమే ఉన్నారు. ఆర్థికంగా స్థోమత లేకపోవడం, కనెక్టివిటీ సమస్యలు, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో లేకపోవడం వంటి వాటి కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యకు దూరమవుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. 


ఎస్సీ/ఎస్టీల్లో పరిస్థితి ఘోరం..

దళితులు, ఆదివాసీ విద్యార్థులపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఆన్‌లైన్‌ విద్యా విధానం, రెగ్యులర్‌ విద్య వంటి అంశాలన్నింటిలోనూ వారు వెనుకబడే ఉన్నారు. ఎస్సీ/ఎస్టీల్లో కేవలం 4 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌ విద్యను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారు. ఇది ఇతర విద్యార్థుల్లో 15 శాతంగా ఉంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో 98 శాతం మంది పాఠశాలలు వీలైనంత త్వరగా తెరవాలని అభిప్రాయపడ్డారు. 

సమయం పడుతుంది..
విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చాలా కాలం పడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు చేయడంతో పాటు సామాజికంగా వారిని ముందుకు నడిపించడం, పాఠశాలల భవనాలకు అనుమతులు తీసుకోవడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ఇలాంటి వాటిని చక్కదిద్దేందుకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అస్సాం, బిహార్, ఢిల్లీ, హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో మొత్తం 100 మంది వాలంటీర్ల ద్వారా ఈ అధ్యయనం జరిగింది.

మరిన్ని వార్తలు