దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ

20 Mar, 2021 06:00 IST|Sakshi

మహారాష్ట్ర, పంజాబ్‌లలో కరోనా నిబంధనలు

ఆంక్షలను పాటిస్తారనుకుంటున్నా: సీఎం ఉద్ధవ్‌

ముంబై/చండీగఢ్‌: దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ ఆంక్షలు తిరిగి అమల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోనూ, పంజాబ్‌లోని 11 జిల్లాల్లోనూ కోవిడ్‌ ఆంక్షలను పెడుతున్నట్లు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు. మార్చి 31 వరకు డ్రామా థియేటర్లు, ఆడిటోరియాలలో కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

గత 24 గంటల్లో ఏకంగా 25 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆరోగ్యం, అత్యవసర సేవలకు సంబంధించినవి తప్ప మిగిలిన ప్రభుత్వం, సెమీ–గవర్నమెంట్‌ కార్యాలయాలన్నీ కోవిడ్‌ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. ఆడిటోరియాలలో మత, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక సమావేశాలు జరపరాదని స్పష్టం చేసింది. నియమాలను ఉల్లంఘిస్తే ఆయా ప్రదేశాల యజమానులపై పెనాల్టీలు పడతాయని తెలిపింది. తయారీ రంగానికి మాత్రం పూర్తి స్థాయి కార్మికులతో పని చేసుకోవడానికి అనుమతిచ్చింది.  లాక్‌డౌన్‌ ఐచ్ఛికం మాత్రమేనని, ప్రజలు నిబంధనలు పాటిస్తారని నమ్ముతున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు.

పంజాబ్‌లో 11 జిల్లాల్లో..
మరణాలు, పెళ్లిళ్లకు 20 మంది మాత్రమే హాజరు కావడం తప్ప మిగిలిన అన్ని రకాల కార్యక్రమాలకు గుంపులుగా హాజరు కావడాన్ని నిషేధిస్తున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌æ  సింగ్‌ ప్రకటించారు. కోవిడ్‌ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.  అన్ని రకాల విద్యా సంస్థలను నెలాఖరు వరకు మూసేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు