కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాల భేటీ.. ఊహించని విధంగా హాజరై షాకిచ్చిన ఆ రెండు పార్టీలు

7 Dec, 2022 16:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యకక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఊహించని విధంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగగ్రెస్‌ పార్టీలు పాల్గొన్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొని అందరిని ఆశ్యర్యానికి గురి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యకక్షుడైన ఖర్గే ప్రస్తుతం రాజ్యసభలో విపక్షాల నేతగా కూడా కొనసాగుతున్నారు. బుధవారం నుంచి  శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదురొర్కొనేందుకు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించడానికి, ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు.

వామపక్షాలతోపాటు  డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీడీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్‌ఎస్‌పీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ భేటీకి ఆప్, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా హాజరవ్వడం గమనార్హం. ఈ సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. ప్రజాస్వామ్య చర్చలకు నిలయం పార్లమెంట్‌ అని  పేర్కొన్నారు. భావసారూప్యత గల పార్టీలతో కలిసి ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఎక్కువ ఇస్తామన్న ప్రధాని మోదీ, తన మాటను నిలబెట్టుకుంటారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో జరిగే అన్ని చర్చలకు తాము సహకరిస్తామన్నారు. అయితే ముఖ్యమైన బిల్లులను ఆమోదించడంలో హడావుడి చేయకుండా పరిశీలన కోసం జాయింట్‌ లేదా సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ఆయన సూచించారు.
చదవండి: గుజరాత్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్‌ పోల్స్‌ తారుమారు

మరిన్ని వార్తలు