విమానంలో అద్భుతం.. పసిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ డాక్టర్లు

28 Aug, 2023 15:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రాణం పోయడంలో దేవుడి తర్వాత దేవుడిగా డాక్టర్లనే కొలుస్తూ ఉంటారు. ఈ మాటను నిజం చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోశారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రావడంతో అదే విమానంలో ఉన్న ఐదుగురు ఎయిమ్స్  డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ నిర్వహించి బిడ్డ ప్రాణాలు కాపాడారు. 

బెంగుళూరు నుంచి ఢిల్లీ పయనమైన విస్తార విమానం UK -814లో రెండేళ్ల చిన్నారికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపటిలోనే పల్స్ ఆగిపోయింది. బిడ్డ చర్మం నీలిరంగులోకి మారిపోయి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లిస్తున్నట్లు సిబ్బంది అత్యవసర ప్రకటన చేసింది. విషయం తెలుసుకున్న అదే విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ డాక్టర్లు వెంటనే అప్రమత్తమై బాలికకు సీపీఆర్ నిర్వహించారు.

విమానం నాగ్‌పూర్‌కు చేరేవరకు బిడ్డ ప్రాణాలను అదిమి పట్టుకున్నారు. ఎలాగోలా ఐవీ క్యానులాను అమర్చగలిగారు. బిడ్డ యధాతథంగా ఊపిరి తీసుకునేంతవరకు ఎయిమ్స్ డాక్టర్లు చాలా శ్రమించారు. చిన్నారిని నాగ్‌పూర్‌కు తరలించిన తర్వాత సర్జరీ నిర్వహించగా ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు.  

అత్యవసర పరిస్థితుల్లో చిన్నారికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ వైద్యులు డా.నవదీప్ కౌర్, డా.దమన్‌దీప్, డా.రిషబ్ జైన్, డా.ఒయిషికా, డా.అవిచల తక్షక్‌లను అభినందిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో వారికి అభినందనలు తెలుపుతూ చిన్నారితో సహా డాక్టర్ల ఫోటోలను షేర్ చేసింది. 

ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య!

మరిన్ని వార్తలు