13 ఏళ్ల తర్వాత కుటుంబంతో సినిమా చూశా!.. భార్యతో అమిత్‌ షా సరదా వ్యాఖ్య

2 Jun, 2022 08:40 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. గంభీరంగానే ఉంటూ అప్పుడప్పుడు సరదాగా వ్యవహరిస్తుంటారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ చిత్రాన్ని కుటుంబంతో పాటు వీక్షించారు అమిత్‌ షా. చాలా ఏళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి ఆయన సినిమా చూశారట ఆయన. అయితే చివర్లో జరిగిన ఓ ఘటన.. అక్కడ నవ్వులు పూయించింది. 

బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని చాణక్య ఫిల్మ్‌ హాల్‌లో సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌ జరిగింది. దీనికి అమిత్‌ షా తన కుటుంబంతో పాటు హాజరయ్యారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత కుటుంబంతో అదీ థియేటర్‌లో ఓ సినిమా చూసినట్లు ఆయన వ్యాఖ్యానించారు.  చివర్లో తన ప్రసంగం ముగిసిన వెంటనే అమిత్‌ షా బయటకు వెళ్తుండగా.. ఆయన భార్య సోనాల్‌ మాత్రం కాస్త గందరగోళానికి గురై అక్కడే అటు ఇటు చూస్తూ ఉండిపోయారు.

దీంతో ‘చలియే హుకుం’ అని గాంభీర్యమైన స్వరంతో అన్నారు అమిత్‌ షా. ఆ మాటకు ఆమె సిగ్గుతో తలదించుకోగా.. అక్కడున్న వాళ్లంతా గోల్లున నవ్వారు. ఆ తర్వాత షా తనయుడు జై షా తన తల్లిని దగ్గరుండి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు. 
 
ఇక సినిమా చూశాక.. సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ యూనిట్‌పైనా అమిత్‌ షా ప్రశంసలు గుప్పించారు. భారతీయ సంప్రదాయాన్ని.. ముఖ్యంగా మహిళా సాధికారికత.. వాళ్లను గౌరవించడం గురించి సినిమాలో అద్భుతంగా చూపించారంటూ మెచ్చుకున్నారు. 2014లో భారతదేశంలో సాంస్కృతిక మేల్కొలుపు ప్రారంభమైందని, ఇది భారతదేశాన్ని ఒకప్పటిలా శిఖరాలకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. జూన్‌ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు