-

అయోధ్యకు మాజీ సీఎం కోడలు విరాళం

20 Feb, 2021 16:34 IST|Sakshi

భారీగా అందుతున్న విరాళాలు

సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరిగిన మందిరాన్ని 1500 కోట్లతో నిర్మించాలని ఆలయ ట్రస్ట్‌ భావిస్తోంది. రానున్న మూడేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీనికి అనుగుణంగానే డిజైన్‌ను సైతం సిద్ధంచేశారు. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ కూడా భాగస్వామ్యం కావాలని దేశ వ్యాప్తంగా హిందువులు, ఇతర వర్గాలు పరితమిస్తున్నారు. దీని కోసం తమ వంతుగా పెద్ద ఎత్తున విరాళాలను అందిస్తున్నారు. సామాన్యుడి నుంచి బడా వ్యాపారుల వరకు అందరూ విరాళాలు ఇస్తున్నారు. నిధుల సమీకరణపై ఓవైపు కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ.. వందలకోట్ల రూపాయాలు ట్రస్టుకు విరాళంగా అందుతున్నాయి.

దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుంటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు నిర్ణయించారు. దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా నిధులను సమీకరిస్తున్నారు. ట్రస్టు సభ్యులు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1511 కోట్ల రూపాయాలు అందాయి. ఫిబ్రవరి 27 వరకే నిధుల సేకరణ కార్యక్రమం జరుగనుంది. దీంతో  విరాళాలు అందించేందుకు  సామాన్యులు మొదలు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు రామాలయం కోసం తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయ్‌ సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణయాదవ్‌ అయోధ్య మందిరానికి విరాళం అందించారు. తన వ్యక్తిగతంగా 11 లక్షల రూపాయాలను అందిస్తున్నట్లు శనివారం తెలిపారు. ఈ మేరకు తన నివాసానికి వచ్చిన రామభక్తులు, ప్రచారక్‌ సభ్యులకు చెక్‌ను అందించారు. తన కుటుంబ సభ్యుల తరఫున తాను విరాళం ఇవ్వలేదని, కేవలం తన వ్యక్తిగతమని అపర్ణ స్పష్టం చేశారు. కాగా యూపీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అపర్ణ యాదవ్‌ విరాళం ఇవ్వడం యూపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున ఆమె పోటీచేశారు. 

మరిన్ని వార్తలు