హైదరాబాద్‌ వైద్య విద్యార్థినిపై పుదుచ్చేరిలో లైంగిక దాడి యత్నం

6 Sep, 2022 07:36 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై: వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడి ప్రయత్నం కేసులో పుదుచ్చేరి పోలీసుతో పాటు అతని స్నేహితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జిప్మర్‌ వైద్య విద్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ గత వారం వైద్య విద్యార్థుల ప్రత్యేక సదస్సు జరిగింది.

ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి విద్యార్ధిని విద్యార్థులు వచ్చారు. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి ఓ విద్యార్థిని (21) మిత్రులతో వచ్చింది. గురువారం రాత్రి జిప్మర్‌ ఆడిటోరియం వద్ద ఉన్న పార్కింగ్‌స్టాండ్‌లో ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఆమెను వేధించారు. బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించారు. స్నేహితురాలు కనిపించక పోవడంతో సహచరులు గాలించారు.

పార్కింగ్‌ స్టాండ్‌ సమీపంలో దృశ్యాలను చూసి కేకలు పెట్టారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. రంగంలోకి దిగిన పుదుచ్చేరి పోలీసులు ఆ యువతిని జిప్మర్‌కు తరలించారు. ఆ ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తూ వచ్చారు. సీసీ కెమెరాలలోని దృశ్యాల ఆధారంగా ఆ ఇద్దరిని గుర్తించారు. ఒకరు జిప్మర్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ కన్నన్‌(31), ఫ్రెండ్స్‌ ఆఫ్‌ పోలీసుకు చెందిన శివ(20)గా గుర్తించారు. అజ్ఞాతంలో ఉన్న ఈ ఇద్దరిని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్‌ నిమిత్తం కాలాపట్టు కారాగారానికి తరలించారు. కన్నన్‌పై శాఖపరంగా చర్యలకు సిద్ధమయ్యారు.   

చదవండి: (గుడియాత్తంలో ప్రేమికుల ఆత్మహత్య?.. రీట ఇంటి సమీపంలో వ్యవసాయబావిలో)

మరిన్ని వార్తలు