బెంగళూరులో చెత్త సంక్షోభం

5 Jul, 2022 07:19 IST|Sakshi
బసప్ప సర్కిల్‌లో తొలగించేవారు లేక పేరుకుపోయిన చెత్త

బనశంకరి(బెంగళూరు): వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పౌరకార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మె ప్రభావం కారణంగా పౌరకార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో చెత్త సమస్య తలెత్తింది. బెంగళూరులో రోడ్లను స్వీపింగ్‌ యంత్రాలతో ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హమీ ఇచ్చేవరకు సమ్మె వదిలిపెట్టేది లేదని పౌర కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో నగర రోడ్లలో చెత్త రాశులుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. బెంగళూరులోని క్రీడా మైదానాలు, బస్టాండ్లు, బస్‌షెల్టర్లు, మార్కెట్లు ప్రాంతాల్లో చెత్తతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. గత శుక్రవారం నుంచి చెత్త తొలగింపు నిలిచిపోయింది.  

బెంగళూరులో 70 శాతం మంది సమ్మె  
బెంగళూరు నగరంలో 18 వేల మంది పౌర కార్మికులు ఉండగా 70 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాలు పెంపు, పర్మినెంట్‌ తదితరాలపై ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో 54,512 మంది కాంట్రాక్టు పౌర కార్మికులు ఉండగా వీరిలో 10,755 మందిని పర్మినెంట్‌ చేశారు. మిగిలిన కార్మికులను కూడా పర్మినెంట్‌ చేయాలని సమ్మెకు దిగారు. పౌర కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. సమ్మె వల్ల రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో చెత్త సమస్య తలెత్తింది.  

యంత్రాలతో చేయిస్తాం  
సమ్మె వల్ల చెత్త సమస్య తలెత్తిందని పాలికె పొడిచెత్త నిర్వహణ విభాగం ప్రత్యేక కమిషనర్‌ డాక్టర్‌ హరీశ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం బీబీఎంపీలో మాట్లాడుతూ రెండు స్వీపింగ్‌ యంత్రాలతో రోడ్లను శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని యంత్రాలను సమకూర్చుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు