Bengaluru Suburban Railway Project: కూ.. చుక్‌ చుక్‌ రైలు వచ్చేది ఎప్పుడో..

9 Dec, 2021 15:34 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని నగరవాసులు నిరీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు పచ్చజెండా లభించినా టెండర్ల ప్రక్రియ దశలోనే ఉంది. సుమారు రూ. 15,700 కోట్ల ఖర్చుతో అతి భారీ ప్రాజెక్టు అయిన సబర్బన్‌ రైల్వే యోజనకు ఆరంభంలోనే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్‌ రద్ధీని తగ్గించడంతో పాటు నగర శివార్లను సులభంగా కలిపేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.  

నాలుగు ప్రాంతాలకు అనుసంధానం.. 
►  సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) మోడల్‌లో చేపట్టారు. మొత్తం 148.17 కిలోమీటర్ల దూరంలో నాలుగు ప్రత్యేక కారిడార్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.  
►  బెంగళూరు–దేవనహళ్లి (41.40 కి.మీ.), బైయ్యప్పనహళ్లి–చిక్కబాణవర (25.01 కి.మీ.), కెంగేరి–బెంగళూరు కంటోన్మెంట్‌ (35.52 కి.మీ.), హీలలిగే– రాజనుకుంటే (46.24 కి.మీ.) రూట్లతో నగరవాసుల ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.  
►  ఈ ప్రాజెక్టులో మొత్తం 62 స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 101.7 ఎకరాల భూమి అవసరం. ఈ భూమి స్వాధీనం కోసం రూ. 1,419 కోట్ల ఖర్చు అవుతుంది.  

కేటాయింపులు ఈ విధంగా..  
 ప్రాజెక్టు నిధులను 20 శాతం చొప్పున కేంద్ర రాష్ట్రాలు భరించి, మిగతా 60 శాతాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. కర్ణాటక ప్రభుత్వం రూ. 5,087 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 3,242 కోట్లు ఇస్తాయి. 
రుణం ద్వారా రూ. 7,438 కోట్లను తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ దశలో ఉంది. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఆకర్షణీయ హామీగా మారిందే తప్ప సాకారం అయ్యేదెన్నడు అనే ప్రశ్న వినిపిస్తోంది.  

చదవండి: భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం!

మరిన్ని వార్తలు