స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. యోగి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ

27 Dec, 2022 15:49 IST|Sakshi

అలహాబాద్‌: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్‌ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ ఓబీసీలకు రిజర్వేషన్‌ లేకుండానే అర్బణ్‌ లోకల్‌ బాడీ ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ సౌరవ్‌ లావానియాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది.

అర్బణ్‌ లోకల్‌ బాడీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్‌ 5న ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 200 మున్సిపల్‌ కౌన్సిల్‌లో 54 ఛైర్‌పర్సన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో 18 మహిలకు కేటాయించింది. అలాగే 545 నగర పంచాయతీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్‌ కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు

ఈ క్రమంలో సుప్రీం కోర్టు సూచించిన ట్రిపుల్‌ టెస్ట్‌ ఫార్ములానూ అనుసరించకుండానే ఓబీసీలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్లు. రిజర్వేషన్లు కల్పించే ముందు రాజకీయంలో ఓబీసీలు వెనకబడి ఉన్నారనే అంశంపై ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు సూచనలను ప్రభుత్వం అనుసరించలేదని కోరారు. అయితే, తాము రాపిడ్‌ సర్వే నిర్వహించామని, అది ట్రిపుల్‌ టెస్ట్‌ ఫార్ములాను అనుసరిస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ పిల్‌పై శనివారం విచారించిన డివిజన్‌ బెంచ్‌ ఇరువైపుల వాదనలు విని తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

ఇదీ చదవండి: బూస్టర్‌ డోస్‌గా ‘నాసల్‌’ వ్యాక్సిన్‌.. ధర ఎంతంటే?

మరిన్ని వార్తలు