రాహుల్‌ గాంధీపై బీజేపీ వివాదాస్పద ఫొటో.. రావణుడితో పోల్చి..

5 Oct, 2023 18:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

వివరాల ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రావణుడి అవతారంలో రాహుల్‌ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఇక, రాహుల్‌ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్‌ను పెట్టింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్‌ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్, జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించారని ఆ పోస్టర్‌లో పేర్కొంది.  ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. 

ఈ ఫొటోపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ స్పందిస్తూ.. రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరిస్తూ గ్రాఫిక్ ఫోటోలు విడుదల చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడిపై హింసను ప్రేరేపించడం, రెచ్చగొట్టడం కోసమే ఈ పోస్ట్ చేశారని మండిపడ్డారు. దేశాన్ని విభజించాలని చూసిన కొన్ని శక్తులు.. రాహుల్ గాంధీ తండ్రి, అమ్మమ్మలను హత్య చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అబద్ధాల కోరు అని ఆరోపించారు. తన పార్టీని ఇలాంటి అసహ్యకరమైన పోస్టులు చేయాలని కోరడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని.. ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవని మండిపడ్డారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదని గట్టి సమాధానం ఇచ్చారు. 

ఇదిలా ఉండగా.. జార్జ్ సోరోస్ ఒక హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. అతను దేశాన్ని అస్థిరపరిచేందుకు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. అతను అనేక భారతదేశ వ్యతిరేక ప్రచారాలను నడుపుతున్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో రాహుల్‌ గాంధీ తన అమెరికా పర్యటనలో హంగేరియన్‌-అమెరికన్‌ వ్యాపారి నిధులు సమకూర్చుకున్న వ్యక్తులను కలిశారని బీజేపీ ఆరోపించింది. జార్జ్ సోరోస్‌తో అనుబంధం ఉన్న సునీతా విశ్వనాథ్‌ను రాహుల్ అమెరికా పర్యటనలో కలిశారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ను బీజేపీ కోరింది.

ఇది కూడా చదవండి: సిసోడియా అరెస్ట్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. సాక్ష్యం ఎక్కడ?

మరిన్ని వార్తలు