‘రాహుల్‌ అనర్హతవేటుపై.. కాంగ్రెస్‌లోనే జరిగిన కుట్ర!’

24 Mar, 2023 20:21 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుపై బీజేపీ స్పందించింది. రాహుల్‌కు మద్ధతుగా వ్యాఖ్యలు చేసే క్రమంలో కాంగ్రెస్‌ నేతలు కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలను బలంగా తిప్పికొట్టారు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అనురాగ్‌ ఠాకూర్‌లు. అసలు ఇది కాంగ్రెస్‌లోనే జరిగిన కుట్ర అని పేర్కొన్నారు వాళ్లు. 

శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ధర్మేంద్ర ప్రధాన్‌, అనురాగ్‌ ఠాకూర్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఈ వ్యవహారంలో మీరు(రాహుల్‌ గాంధీ) లోతుగా వెళ్తేనే అసలు విషయాలు తెలుస్తాయి. మిమ్మల్ని అడ్డుతొలగించుకునేందుకు, పార్టీ నుంచి వదిలించుకునేందుకు ఎవరు కుట్ర పన్నారనేది మీకే అర్థమవుతుంది. కాంగ్రెస్‌ పార్టీలో నిష్ణాతులైన న్యాయవాదులెందరో ఉన్నారు. అలాంటప్పుడు మీకు సలహా ఇవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదా? అని ఠాకూర్‌ ప్రశ్నించారు. 

అలాగే.. రాహుల్‌ గాంధీ కేవలం 21 లోక్‌సభ చర్చల్లో మాత్రమే పాల్గొన్నారని, 2009 నుంచి పార్లమెంటేరియన్‌గా ఉన్నప్పటికీ ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని కేంద్ర మంత్రి ఠాకూర్‌ విమర్శించారు. అంతెందుకు రాహుల్ గాంధీ తన సొంత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చించివేసిన సంఘటనను కూడా ప్రస్తావించారు. రాహుల్‌కి ఇదేం కొత్త కాదని, ఇలాంటి ఏడు కేసుల్లో బెయిల్‌ మీద ఉన్న విషయాన్ని ప్రస్తావించిన ఠాకూర్‌.. జరగబోయే పరిణామాలను పట్టించుకోకుండా మాట్లాడడం రాహుల్‌కు అలవాటైన పనేనని విమర్శించారు. 

ఇక మరో కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ మాట్లాడుతూ..  రాహుల్‌ గాంధీకి ఇలాంటి నేరాలు అలవాటయ్యాయని పేర్కొన్నారు. రాహుల్‌ చేసిన మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన.. ఫ్యూడల్‌ మనస్తత్వం ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడతారని రాహుల్‌పై మండిపడ్డారు. అంతకు ముందు మరో కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఈ పరిణామంపై స్పందిస్తూ..  కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దేశ చట్టం కంటే ఉన్నతమైనవారా?.  ఓబీసీ సమాజానికి చెందిన ఓ ఇంటిపేరును దుర్భాషలాడడం, అవమానించడం జాతీయ నాయకుడి పనా? అంటూ మండిపడ్డారాయన. 

మరిన్ని వార్తలు