పది మంది బీజేపీ ఎంపీల రాజీనామా, కారణం ఏంటంటే..

6 Dec, 2023 19:37 IST|Sakshi
నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌,రాజ్యవర్ధన్ రాథోడ్

సాక్షి, న్యూఢిల్లీ:  బీజేపీ ఎంపీలు భారీగా రాజీనామాలు సమర్పించారు. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల (రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌) అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలువురు ఎంపీలను బీజేపీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో  ఎమ్మెల్యేలుగా  గెలుపొందిన 10 మంది బీజేపీ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బ్లీర్లాను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. అందులో.. మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉ‍న్నారు.

అదేవిధంగా.. రాజస్థాన్ నుంచి రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా, దియా కుమారి, చత్తీస్‌గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింగ్‌పూర్ సెగ్మెంట్‌ నుంచి గెలుపొందిన బీజేపీ నేత ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత తాను లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అదే విధంగా త్వరలో కేం‍ద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు