తబ్లిగీ జమాత్: వారిని బలిపశువులను చేశారు

22 Aug, 2020 20:14 IST|Sakshi

ముంబై :  ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కాజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను శనివారం బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది. మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైన విదేశీ పౌరులను బలి పశువులు చేశారని, కరోనా వ్యాప్తికి వారు కారణమయ్యారని అనవసర ప్రచారం జరిగిందని హై కోర్టు తెలిపింది. ఈ మేరకు 29 విదేశీయులపై నమోదైన కేసులను కొట్టివేస్తున్నట్లు జస్టిస్‌ టీవీ నాలావాడే ఎంజీ సెవ్లికర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. (కేంద్ర నిర్ణయం : ఏకమైన విపక్షాలు)

ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరించారని, రాజకీయ బలవంతంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ధర్మాసనం పేర్కొంది. అలాగే వీరిపై సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం చేసినందుకు సోషల్ మీడియాపైనా బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైనట్లు అప్పట్లో పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. (అన్‌లాక్‌ 3.0: యూటీలు, రాష్ట్రాలకు కేంద్రం లేఖ)

పర్యాటక వీసా అనుమతులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మంది విదేశీ పౌరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం 50 సంవత్సరాల నుంచి కొనసాగుతోందని, ఇది ఏడాదంతా సాగుతుందని వ్యాఖ్యానించింది. అతిథులను స్వాగతించే గొప్ప సంప్రదాయం, సంస్కృతిని భారతదేశ ప్రజలు నిజంగా పాటిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపడాలని పేర్కొంది. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు