జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..

11 Sep, 2023 10:38 IST|Sakshi

ఢిల్లీ: జీ20 వేదిక భారత మండపం వద్ద వర్షపు నీరు వరదలుగా పారుతోందని విపక్షాలు చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పుబట్టింది. ప్రతిపక్షాల వ్యాఖ్యలు అవాస్తవాలని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తేలికపాటి వర్షం నీరు భారత మండపం బయట నిలిచిందని పేర్కొంది. వెంటనే ఆ నీటిని మోటర్లను ఉపయోగించి బయటకు పంపినట్లు వెల్లడించింది. 

‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు.

 ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్‌ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్‌ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ కాంగ్రెస్‌ పార్టీ నేత పవన్‌ ఖేరా పేర్కొన్నారు.  

అటు టీఎంసీ నేత సాకేత్ గోఖలే కూడా కేంద్రాన్ని విమర్శించారు. రూ.4000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వర్షం నీరు వరదలుగా పారుతోందని విమర్శించారు. నిధులను మోదీ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో తెలుస్తోందని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కేంద్రం స్పందించింది. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది.  అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. 

ఇదీ చదవండి: జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగింత

మరిన్ని వార్తలు