అచ్చం రోజా సినిమా తరహాలోనే.. అడవి బాట పట్టిన సబ్‌ ఇంజనీర్‌ భార్య

18 Nov, 2021 08:44 IST|Sakshi

చర్ల(ఛత్తీస్‌గఢ్‌): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు వారం క్రితం కిడ్నాప్‌ చేసిన సబ్‌ ఇంజనీర్‌ను బుధవారం విడుదల చేశారు. దీంతో వారంరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజాపూర్‌ జిల్లా మాంకేలీ సమీపంలోని ఘట్‌కేర్నీ లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం (పీఎంజీఎస్‌వై) కింద చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈనెల 11న సబ్‌ ఇంజనీర్‌ అజయ్‌రోషన్, అటెండర్‌ లక్ష్మణ్‌తో కలసి వెళ్లారు.

ఈ సందర్భంగా మావోయిస్టులు వీరిద్దరినీ కిడ్నాప్‌ చేయగా, మరుసటి రోజు లక్ష్మణ్‌ను విడిచిపెట్టారు. అప్పటి నుంచి అధికారులు సబ్‌ ఇంజనీర్‌ విడుదల కోసం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. 

అడవి బాట పట్టిన అజయ్‌ భార్య 
సబ్‌ ఇంజనీర్‌ అజయ్‌ను విడుదల చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన భార్య అంకిత అడవి బాట పట్టారు. రెండేళ్ల కుమారుడిని వెంట పెట్టుకుని ఆమె మీడియా బృందంతో కలసి అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఐదు రోజులకు మావోయిస్టుల శిబిరానికి చేరుకున్న అంకిత, మీడియా బృందం సభ్యులు.. మావోయిస్టులతో చర్చలు జరిపారు. అనంతరం మావోయిస్టులు అదే ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి సబ్‌ ఇంజనీర్‌ అజయ్‌ను విడిచిపెట్టారు.

దీంతో బుధవారం సాయంత్రం అజయ్‌ బీజాపూర్‌కు చేరుకోగా అస్వస్థతతో ఉన్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, తన మొర విని భర్త ప్రాణాలకు హాని తలపెట్టకుండా విడిచిపెట్టడంపై అంకిత మావోయిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.

రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం..
తన భర్తను మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రెండేళ్ల కుమారుడితోపాటు అడవి బాట పట్టిన అజయ్‌ భార్య అంకిత ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అడవిలో అన్వేషణ సాగించారు. ఈనెల 13, 14, 15, 16వ తేదీల్లో అక్కడి మీడియా ప్రతినిధులు ఒకరిద్దరితో కలసి ద్విచక్ర వాహనాలపై రోజూ 30, 40 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణించి ఆదివాసీ గూడేల్లో భర్తకోసం వెతికారు.

చివరకు బుధవారం వీరు వెళ్లిన ఓ గ్రామం వద్ద మావోయిస్టుల కొరియర్‌ తారసపడి తన వెంట అంకిత సహా మీడియా బృందాన్ని తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఓ ఆదివాసీ గ్రామంలో ప్రజాకోర్టు నిర్వహించి ఇకనైనా రోడ్డు పనులను నిలిపివేయాలని హెచ్చరిస్తూ అజయ్‌ను విడుదల చేశారు.   

మరిన్ని వార్తలు